క్రిషాంగి మేష్రామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన సొలిసిటర్‌గా చరిత్ర సృష్టించారు. ఆమె భారతీయ సంతతికి చెందిన యువతి కావడం మనకెంతో గర్వకారణం. 21 ఏండ్ల వయసులోనే యంగెస్ట్ సోలిసిటర్ అయ్యారు. అకాడమిక్, ప్రొఫెషనల్ కెరీర్‌లో ఆమె అత్యుద్భు తంగా రాణించారు. 15 ఏండ్ల వయసు నుంచే ఆమె న్యాయ విద్యలో అందరి దృష్టిని ఆకర్షించారు.
పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్‌కు చెందిన క్రిషాంగి చిన్నతనం నుండే న్యాయశాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం 15 ఏండ్ల వయసులోనే తన ప్రయాణాన్ని ప్రారంభించారు. యూకేలో డిగ్రీ చేసిన ఆమె అక్కడే తన తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మిల్టన్ కీన్స్‌లోని ది ఓపెన్ యూనివర్సిటీలో చేరాలని నిర్ణయించుకుంది.
ఓపెన్ ఎంట్రీ ద్వారా
‘నేను బ్రిటిష్ అర్హతలు పొందినందున యూకేలోని ఒక విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేయాలని కోరుకున్నాను. అయితే కేవలం పదిహేనేండ్ల వయసులోనే నా తల్లిదండ్రులకు, చెల్లెలికి దూరంగా ఉండడం నా వల్ల కాలేదు. దాంతో నా కోసం నా కుటుంబం కూడా నాతో ప్రయాణించింది. మా అందరికీ ప్రయాణాలంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మేమంతా కలిసి మా సాహసయాత్రను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చాము. నా చదువు కోసం అధ్యయనం ప్రారంభించాము. అప్పుడే నేను ఓయూ గురించి తెలుసుకున్నాను. వెంటనే దరఖాస్తు చేసుకున్నాను. నేను A లెవెల్స్ లేకుండా డిగ్రీని ప్రారంభించడానికి ఓపెన్ ఎంట్రీ విధానాన్ని ఉపయోగించుకోగలిగాను. అలా నేను నా కుటుంబంతో కలిసి ఉంటూ యూకే విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను’ అని క్రిషాంగి ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో పంచుకున్నారు.
విలువైన నైపుణ్యాలు
సమాజానికి ఉపయోగపడే డిగ్రీ చేయాలని క్రిషాంగి కోరుకుంది. అందుకే ఆమె న్యాయవాద విద్యను అభ్యసించాలని నిర్ణయించుకుంది. కానీ దానితో పాటు ఓయూ ఆమెకు నేర్పించిన ఇతర విలువైన నైపుణ్యాలు ఎన్నో ఉన్నాయి. అదే స్వీయ క్రమశిక్షణ. 18 ఏండ్ల వయస్సులో బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత క్రిషాంగి సింగపూర్ లా ఫర్మ్‌లో రిమోట్ ఉద్యోగంలో చేరారు. ఇది ఆమె కేవలం మూడేండ్లలో న్యాయవాదిగా చేరడానికి సహాయపడింది. ‘నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటి నుండి పూర్తి సమయం పనిచేస్తున్నాను. ఇప్పుడు పూర్తి స్థాయి న్యాయవాదిగా మారడానికి అవసరమైన అర్హతలను పూర్తి చేస్తున్నాను’ అని ఆమె చెప్పారు.
తదుపరి అడుగు
ఇంగ్లాండ్‌లో అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్‌గా యువ ప్రతిభ ఇప్పుడు తన కెరీర్‌లో తదుపరి అడుగు వేయడానికి చూస్తోంది. ‘నా తదుపరి దశ నాకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం. వీలునామాలు, ప్రొబేట్ వంటి ముఖ్యమైన పత్రాలతో వారికి సహాయం చేస్తూ, వ్యాపారులు, ప్రైవేట్ క్లయింట్‌లకు న్యాయవాది కావాలని నేను ఆశిస్తున్నాను’ అని ఆమె చెప్పారు. 2022లో మెష్రామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024లో మాంచెస్టర్‌లో ఆమె ఆ సెర్మనీకి హాజరయ్యారు. డిగ్రీ, పీజీ తర్వాత రెండేండ్ల పాటు సింగపూర్‌లో ఆ న్యాయ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేశారు. దీంతో అంతర్జాతీయ లీగల్ ప్రాక్టీస్‌లో ఆమె ఆసక్తి పెరిగింది. ఇటీవలే ఆమె సొలిసిటర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణురాలైంది. దీంతో ఆమె అధికారికంగా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రక విజయంతో పాటు లా సొసైటీ గెజిట్ ఆగస్టు 1 కాపీలో స్థానం పొంది మెష్రామ్ మరో మైలురాయిని కూడా అందుకున్నారు.
అస్సలు ఊహించలేదు
‘మేము ఆమెను ఎంత వరకు చేయగలిగితే అంత వరకు ప్రయత్నం చేయమని ప్రోత్సహించాము. కానీ ఆమె నుండి మేము ఇంత గొప్ప ఫలితాన్ని ఊహించలేకపోయాము. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక చిన్న కోర్సు పూర్తి చేసిన తర్వాత క్రిషాంగికి న్యాయశాస్త్రంపై ఆసక్తి మొదలైంది. ఆమె ఆసక్తిని మేము కాదనకుండా ప్రోత్సహించాము. ఇదే ఆమెకు ఎన్నో విలువలతో పాటు సమాజానికి నిష్పాక్షికమైన న్యాయం అందించాలనే ఆలోచనలు కలిగించేలా చేసింది. చిన్నప్పటి నుండే ఆమె స్వీయ క్రమశిక్షణతో ఉండేది. నేటి విషపూరిత విద్యా పోటీకి ఆమెను మేము దూరంగా ఉంచాము’ అని ఆమె తండ్రి గుర్తు చేసుకున్నారు.
ఆచరణాత్మక అనుభవం
‘ఆసక్తితో చదువుకోవడం, విద్యా స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా క్రమశిక్షణ, దూర దృష్టిను కూడా ఓయూ నాకు నేర్పింది. ఈ నైపుణ్యాలు నాకు అంతర్జాతీయ న్యాయ సంస్థలో నిలదొక్కుకునే అవకాశాలను సంపాదించడానికి సహాయపడ్డాయి. అక్కడ నేను ఇప్పుడు ఆచరణాత్మక అనుభవాన్ని పొందుతున్నాను. అలాగే నేను చదివింది దూరవిద్య కనుక చదువుతో పాటు, ప్రయాణం, కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేసుకోగలిగాను’ అని క్రిషాంగి పంచుకున్నారు. ఆమె తల్లిదండ్రులైన ఇందిరా మేష్రామ్, తపన్‌లు కూతురు సాధించిన విజయం పట్ల గర్వపడుతున్నారు. అదే సమయంలో చాలా ఆశ్చర్యపోతున్నారు.