Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంగవర్నర్‌ బిల్లులు నిలిపివేస్తే జోక్యం చేసుకోవద్దా?

గవర్నర్‌ బిల్లులు నిలిపివేస్తే జోక్యం చేసుకోవద్దా?

- Advertisement -

ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకున్న రక్షణ ఏమిటి?
రాష్ట్రపతి ప్రస్తావనపై ప్రశ్నించిన సుప్రీంకోర్టు
పార్లమెంట్‌ పని అది : కేంద్రం వాదనలు
న్యూఢిల్లీ :
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన బిల్లులను నిరవధికంగా తమ వద్దనే గవర్నర్లు అట్టిపెట్టుకుంటే చట్టసభ పనిచేయకుండా పోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానాలకు అధికారాలు లేవా? అని ప్రశ్నించింది. బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతూ రాష్ట్రపతి పంపిన ప్రస్తావనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ ఎ.ఎస్‌.చందూర్కర్‌లతో కూడిన బెంచ్‌ వరుసగా మూడోరోజైన గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తన వాదనలు వినిపిస్తూ, రాష్ట్రపతికి, గవర్నర్లకు కాలపరిమితులు విధిస్తూ, వాటికి కట్టుబడి ఉండేలా న్యాయ వ్యవస్థ ఆదేశాలు జారీ చేయలేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. దానిపై గవారు స్పందిస్తూ… మెజారిటీ కలిగిన అసెంబ్లీ ఏకగ్రీవంగా ఒక బిల్లును ఆమోదించి పంపితే దానిపై గవర్నర్‌ ఎలాంటి చర్య తీసుకోకుండా నిరవధికంగా తన వద్దనే నిలిపివేస్తే శాసనసభలు పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతాయని అన్నారు. ”నాలుగేండ్లుగా బిల్లులను గవర్నర్‌ తన వద్దనే అట్టి పెట్టుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? మూడింట రెండు వంతుల మెజారిటీతో ఎన్నికైన సభలోని ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలకు ఉన్న రక్షణ ఏమిటి?” అని ప్రశ్నించారు. తాము ఏదో ఊహించుకుని జోక్యం చేసుకోలేదని, పలు రాష్ట్రాల నుంచి పిటిషన్లు వచ్చిన తర్వాతనే జోక్యం చేసుకున్నామని తెలిపారు. జ్యుడిషియల్‌ రివ్యూ అనేది రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణంలో భాగంగానే ఉన్నప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా ఉండిపోవలసిందేనా? అని ప్రశ్నించారు. గవర్నర్‌ ఎందుకు అనుమతించలేదు? దానికి కారణాలను ఎందుకు తెలపలేదనేది చర్చించడం లేదనీ, గవర్నర్‌ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా పూర్తిస్థాయి శాసనసభ ఆమోదించిన బిల్లులను నిలిపివేయడంపైనే చర్చిస్తున్నామని సీజేఐ తెలిపారు.

తీవ్రమైన పరిస్థితులు ఉత్పన్నమైన సమయంలో కోర్టులు ఒక సాంప్రదాయాన్ని విధించరాదని, పరిష్కారాలనేవి రాజకీయంగానే ఉండాలి తప్ప జ్యుడిషియల్‌గా ఉండరాదని సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. ఇటువంటి కేసులు ఎదురైతే ప్రజాస్వామ్య రాజకీయ క్రమం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. కాలపరిమితులు విధించుకోవడానికి వీలుగా రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ పరిష్కరించాలని లేదా రాజకీయంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలని మెహతా అన్నారు. మరో కార్యాలయం నిర్వహించాల్సిన పాత్రను న్యాయస్థానం పోషించలేదని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క విభాగమూ విఫలమవుతుంది, కేవలం ఈ న్యాయస్థానం ఒక్కటే అందుబాటులో ఉందని భావించడం పొరపాటు అవుతుందని పేర్కొన్నారు. మధ్యలో సీజేఐ గవారు జోక్యం చేసుకుంటూ ఈ న్యాయస్థానం రాజ్యాంగ పరిరక్షకురాలని వ్యాఖ్యానించారు. దానిపై మెహతా స్పందిస్తూ ”రాజ్యాంగ పరిరక్షకురాలైన ఈ న్యాయస్థానం కూడా పరిష్కరించలేని సమస్యలు ఉంటాయి, అటువంటివి సంభవించినప్పుడు రాజ్యాంగ సంస్థలు, కార్యాలయాలు అందుకు బాధ్యత వహించాలి, స్పందించాలి, ఎందుకంటే అవే ప్రజలకు జవాబుదారీ కాబట్టి” అని మెహతా చెప్పారు. గవర్నర్‌ ప్రజలకు జవాబుదారీ కాదని జస్టిస్‌ గవారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దానిపై మెహతా స్పందిస్తూ.. గవర్నర్‌ కార్యాలయం అనేది అత్యంత సున్నితమైనది, ఏ కారణంగానైనా ఆయనను తొలగించవచ్చు, ఒకవేళ ఏదైనా జరిగితే, పాలనా యంత్రాంగంలోని వ్యవస్థే దానికి బాధ్యత వహిస్తుందన్నారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం ఈ విచారణ వచ్చే మంగళవారం కొనసాగనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad