Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుసమాధానాల్లేవ్‌!

సమాధానాల్లేవ్‌!

- Advertisement -

ప్రతిపక్షాల ప్రశ్నల్ని దాటవేసిన మోడీ సర్కార్‌
నిరసనలు, అరెస్టులు, ఆందోళనలు
ఆపరేషన్‌ సిందూర్‌లో దేశానికి జరిగిన నష్టంపై ప్రధాని నో కామెంట్‌
ట్రంప్‌ వ్యాఖ్యలు, సుంకాలపైనా మౌనం
పార్లమెంటును కుదిపేసిన ‘ఓట్‌ చోర్‌’
బీహార్లో ‘సర్‌’ అమలుపై ఆగ్రహం
ఐక్యత చాటిన ‘ఇండియా’ కూటమి
ముగిసిన పార్లమెంట్‌ సమావేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సమాధానాలు చెప్పలేక తటపటాయించింది. జులై 21న వాడీవేడిగా ప్రారంభమైన లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు ప్రతిపక్షాల ప్రశ్నలు, ఆందోళనలు, నిరసనలతో హోరెత్తాయి. పార్లమెంటు వేదికగా కేంద్రంలోని మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాలు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య యుద్ధాన్నే ప్రకటించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ వల్ల భారతదేశానికి జరిగిన నష్టం ఎంతని ప్రశ్నిస్తే, ప్రధాని మోడీ సమాధానం ఇవ్వలేకపోయారు. లోక్‌సభలో దేశభక్తికి సంబంధించి సుదీర్ఘ ఉపన్యాసం దంచికొట్టారే తప్ప, సిందూర్‌పై ప్రతిపక్షాలు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకూ ఆయన సమాధానం చెప్పలేదు. పాకిస్తాన్‌తో భారత్‌ యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపైనా పార్లమెంట్‌ అట్టుడికింది.

దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. అయినా ప్రధాని మోడీ సమాధానం చెప్పకుండా మౌనందాల్చారు. బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ‘సర్‌’ని నిలుపుదల చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి. దాన్నీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు. మహారాష్ట్రలో బీజేపీ సర్కార్‌ విజయానికి ‘ఓట్‌ చోరీ’నే కారణమని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత రాహుల్‌గాంధీ ఆధారాలతో సహా నిరూపించేందుకు ప్రయత్నిస్తే, మోడీ సర్కార్‌ దాన్ని అడ్డుకొనేందుకు శాయశక్తులా ప్రయత్నించింది.

2023 డిసెంబర్‌ 21 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలకు చెందిన 146 మంది సభ్యుల్ని లోక్‌సభ, రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనితో అప్పట్లో దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాల్లో అధికారపక్షం ప్రతిపక్షం పట్ల ఆచితూచి వ్యవహరించింది. ఒకవైపు సభలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నా, లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మెన్‌ సభను కొనసాగించి, ప్రభుత్వ బిల్లులు పాస్‌ అయ్యేలా సహకరించారు. ప్రస్తుత సమావేశాల్లోనే ‘ఓట్‌చోరీ’పై ‘ఇండియా’ బ్లాక్‌ సభ్యులు పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి, ఆధారాలు సమర్పించేందుకు ప్రయత్నించారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభంలోనే అడ్డుకుంది. ‘ఇండియా’ బ్లాక్‌ సభ్యులు బారికేడ్లు దాటుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పలువురు మహిళా ఎంపీలు సొమ్మసిల్లి పడిపోయారు.

రాహూల్‌ó, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, జాన్‌ బ్రిట్టాస్‌ సహా ఎంపీలు అందర్నీ బలవంతంగా అరెస్టులు చేసి, పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్‌సభ, రాజ్యసభల్లో తిరస్కరించారు. కొన్ని బిల్లుల్ని ప్రతిపక్షాలు సభలో లేని సమయంలో కేంద్రం ఆమోదించుకుంది. 30 రోజులకు మించి జైలులో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు తమ పదవులను కోల్పోయేలా కేంద్రం రూపొందించిన బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. చివరకు ఈ బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయజెండా ఎగురవేసి, ఆర్‌ఎస్‌ఎస్‌కు సెల్యూట్‌ అని ప్రశంసించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై చట్టసభలో చర్చకు పట్టుబట్టాయి. యథాప్రకారం కేంద్రం ఆ అంశాన్ని, సమాధానాన్ని కేంద్ర ప్రభుత్వం దాటవేసింది. ఆగస్టు 21న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి ప్రజాసమస్యలు, అంతర్జాతీయ అంశాలపై చర్చలు, నిర్ణయాలు జరగలేదు. కేవలం ప్రభుత్వం తనకు అవసరమైన బిల్లుల్ని మూజువాణి ఓటుతో ఆమోదిం చేసుకుని, సమావేశాల్ని ‘మమ’ అనిపించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad