5, 18 శాతం శ్లాబులకు జీఓఎం అంగీకారం
లగ్జరీ ఉత్పత్తులపై 40 శాతం
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండు శ్లాబుల ప్రతిపాదనలకు మంత్రుల బృందం(జీఓఎం) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో 5, 18 శాతం శ్లాబులను మాత్రమే ఉంచేలా మంత్రుల బృందం అంగీకరించింది. దీంతో పాటు సిగరేట్ లాంటి హానికర ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించేందుకు ఆమోదం తెలిపింది. జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌధరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం గురువారం భేటీ అయ్యింది. పరోక్ష పన్నుల విధానంలో రెండు శ్లాబులు ఉంచాలన్న కేంద్రం ప్రతిపాదనలకు జీఓఎం అంగీకరించింది. ప్రస్తుత వాటిల్లోని 12, 28 శాతం శ్లాబులు తొలగించి.. 5, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంచేందుకు మంత్రుల బృందం ఆమోదం తెలిపిందని జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌధరి వెల్లడించారు. కేంద్ర ప్రతిపాదనలో ఆల్ట్రా లగ్జరీ, సిగరెట్లు వంటి వాటిపై 40 శాతం పన్ను విధించడం కూడా ఉందని యూపీ ఆర్థికమంత్రి సురేశ్ కుమార్ ఖన్నా తెలిపారు. కార్లు, సిగరేట్ల వంటి అల్ట్రా లగ్జరీ వస్తువులపై ప్రస్తుత పన్ను రేటు కొనసాగించేందుకు తమ రాష్ట్రం 40 శాతం జీఎస్టీ రేటుపై లెవీని ప్రతిపాదించిందని పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య అన్నారు. ఈ కొత్త జీఎస్టీ శ్లాబుల అమలు అనంతరం రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టం గురించి కేంద్ర ప్రతిపాదనల్లో లేదన్నారు. దీనిపై వచ్చే నెలలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
పెద్దగా ఒరిగేదేమీ లేదు..!
ప్రస్తుతమున్న జీఎస్టీ శ్లాబుల్లో 18 శాతం పన్ను రేటు అత్యంత కీలకంగా ఉంది. ఈ ఒక్క శ్లాబు నుంచే 65 శాతం ఆదాయం వస్తోంది. జీఎస్టీ నూతన ప్రతిపాదన పన్ను రేట్లలో 18 శాతం రేటును యథాతథంగా కొనసాగించనుంది. ఇందులోని వస్తు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వాలకు వస్తోన్న ఆదాయానికి ఎలాంటి ఢోకా లేదు. ఫలితంగా వాటి వినియోగదారులకు ఇకపైనా ఏమాత్రం ప్రయోజనమూ ఉండదు. ఇప్పుడు ఎంతకు కొంటున్నారో.. కొత్త జీఎస్టీ విధానంలోనూ వాటి కోసం అంతే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సాధారణ ప్రజలపై మోడీ సర్కారు గొప్పగా జీఎస్టీ భారాన్ని తగ్గించబోయేదేమీ లేదు. అదే విధంగా ప్రస్తుతం పేద, మధ్య తరగతి వర్గాలు కొనుగోళ్లు చేస్తోన్న 5 శాతం శ్లాబులోని వస్తు ఉత్పత్తులపై భారం కూడా అలాగే ఉండబోతోందని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.న
జీఎస్టీలో రెండు శ్లాబులకు మంత్రుల బృందం ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES