-కేటాయించిన బడుల్లో నేడు రిపోర్టు చేయాలి
– 26న 2,964 మంది ఎస్జీటీలకూ ప్రమోషన్
– విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 880 మంది స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)లకు గెజిటెడ్ హెడ్మాస్టర్ (జీహెచ్‌ఎం) గ్రేడ్-2 పదోన్నతులను ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మల్టీజోన్-1 పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో 53 మంది, స్థానిక సంస్థల స్కూళ్లలో 437 మంది కలిపి 490 మంది ఎస్‌ఏలకు జీహెచ్‌ఎం పదోన్నతులను కల్పించామని తెలిపారు. మల్టీజోన్-2 పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో 80 మంది, స్థానిక సంస్థల స్కూళ్లలో 310 మంది కలిపి 310 మంది ఎస్‌ఏలకు జీహెచ్‌ఎం పదోన్నతులను ఇచ్చామని వివరించారు. జీహెచ్‌ఎం పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లు శుక్రవారం కేటాయించిన పాఠశాలల్లో రిపోర్టు చేయాలని కోరారు. రాష్ట్రంలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి 2,324 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2,324 ఎస్‌ఏ ఖాళీలతోపాటు 640 ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్ (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులు కలిపి మొత్తం 2,964 ఎస్‌ఏ పోస్టులకు సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతులు కల్పిస్తామని వివరించారు.
ఈనెల 26న ఆ పదోన్నతులకు సంబంధించి ఎస్జీటీలకు ఉత్తర్వులను జారీ చేస్తామని తెలిపారు. గతేడాది జూన్/జులైలో 47,244 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశామని పేర్కొన్నారు. 21,419 మంది టీచర్లకు పదోన్నతులను కల్పించామని వివరించారు. 1,200 మంది ఉపాధ్యాయులకు స్పౌజ్ కేటగిరీ కింద బదిలీ చేశామని తెలిపారు. డీఎస్సీ ద్వారా 10,006 మంది టీచర్ల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.09 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తు న్నారని వివరించారు. 69,863 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి, బదిలీల ద్వారా స్థానచలనం కలిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఖాళీలను బట్టి ఎప్పటి కప్పుడు ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను చేపడుతు న్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియతో పాఠశాలల్లో పరిపాలన, పర్యవేక్షణ మెరుగవుతుందని తెలిపారు.
సవరణ షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన సవరణ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ గురువారం విడుదల చేశారు. ఏడు రోజుల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. గురువారం జీహెచ్‌ఎం గ్రేడ్-2 పోస్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులను కల్పిస్తూ ఆర్జేడీలు ఉత్తర్వులను విడుదల చేశామని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఈనెల 24 వరకు స్కూల్ అసిస్టెంట్, తత్సమాన క్యాడర్ పోస్టుల ఖాళీలను ప్రకటిస్తామని తెలిపారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఎస్జీటీల సీనియార్టీ జాబితాను ప్రకటిస్తామని వివరించారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. ఎస్జీటీల తుది సీనియార్టీ జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈనెల 25న తేదీన స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల కోసం ఎస్జీటీలు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అదేనెల 26న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులను కల్పిస్తూ డీఈవోలు ఉత్తర్వులను జారీ చేస్తారని స్పష్టం చేశారు.