– రూ.30వేల లంచం తీసుకుంటూ..
– సీఐతో పాటు గన్‌మెన్ రవి అరెస్ట్
నవతెలంగాణ – మహబూబాబాద్
అక్రమంగా బెల్లం రవాణా చేస్తున్న వ్యక్తిపై నమోదైన కేసులో లంచం ఇవ్వాలని, లేదంటే అరెస్టు చేసి జైలుకు పంపుతానని బెదిరించి రూ.30వేలు తీసుకుంటూ సీఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. డోర్నకల్ సీఐ రాజేష్‌తో పాటు గన్‌మెన్ రవిని అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. శనివారం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన అక్రమ బెల్లం రవాణా వ్యాపారిపై డోర్నకల్ పీఎస్‌లో మేలో ఒక కేసు, ఆగస్టు మొదటి వారంలో మరో కేసు నమోదయ్యాయి. మొదటి కేసులో పోలీసులు నిందితుడికి నోటీస్ ఇవ్వలేదు. రెండో కేసులో నోటీస్ ఇవ్వగా.. ఆయన హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో డోర్నకల్ సీఐ రాజేష్ ఆదేశాల మేరకు గన్‌మెన్ రవి పదేపదే బెల్లం వ్యాపారికి ఫోన్ చేసి సీఐ పిలుస్తున్నారు రావాలని చెప్పాడు. రూ.50 వేలు లంచం ఇవ్వాలని.. లేదంటే అరెస్టు చేసి జైలుకు పంపుతామని బెదిరించాడు. దాంతో సదరు వ్యక్తి ఈనెల 21వ తేదీన వరంగల్‌లోని ఏసీబీ ఆఫీసులో అధికారులను సంప్రదించాడు. శనివారం డోర్నకల్ సీఐ తన ఇంటి వద్ద బాధితుని నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. గన్‌మెన్ రవిని కూడా అరెస్టు చేశారు. రూ.30 వేలను స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా ఇంట్లో మరో రూ.1,25,050 సొమ్మును సీజ్ చేశారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు.