– నడిరోడ్డుపై యువతిని వివస్త్రను చేసి…
– మద్యం మత్తులో వీరంగం
– అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-జవహర్నగర్
రాష్ట్ర రాజధానికి సమీపంలో.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతితో మద్యం మత్తులో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ఆమెపై దాడి చేసి బట్టలు చింపేసి వివస్త్రను చేశాడు. అతన్ని అడ్డుకోబోయిన ఓ మహిళపై సైతం దాడి చేశాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి, డీఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జవహర్నగర్ కార్పొరేషన్లోని బాలాజీనగర్లో పెద్ద మారయ్య అనే వ్యక్తి భార్య, నలుగురు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అతను బండరాళ్ళు కొడుతూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మారయ్య మద్యానికి అలవాటు పడి కుటుంబంలో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఆదివారం రాత్రి ఓ యువతి దుకాణానికి వెళ్లి వస్తుండగా బాలాజీనగర్ బస్టాప్ వద్ద మారయ్య ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆత్మరక్షణ కోసం యువతి మారయ్యను నెట్టేసింది. కోపోద్రిక్తుడైన మారయ్య యువతిపై దాడిచేసి దుస్తులు లాగేశాడు. అటుగా వెళ్తున్న ఓ మహిళ దాడిని అడ్డుకోబోగా ఆమెనూ కొట్టాడు. అయితే పక్కనే ఉన్న మారయ్య తల్లి అతన్ని వారించకపోవడం గమనార్హం. నగంగా రోడ్డుపై ఏడ్చుకుంటూ కూర్చున్న యువతిని కొద్దిసేపటి తర్వాత స్థానిక మహిళలు కవర్లతో కప్పి జవహర్నగర్ పోలీసులకు సమాచారం అదించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సోమవారం నిందితుడు మారయ్యను రిమాండ్కు పంపించారు.