Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబతికుండగానే చంపేస్తున్నారు..

బతికుండగానే చంపేస్తున్నారు..

- Advertisement -

– ఓటరు జాబితాలో వేలాది మంది పేర్లు మాయం
– బీహార్‌ ఎస్‌ఐఆర్‌లో అనేక లోపాలు
– దృష్టిసారించని ప్రధాన స్రవంతి మీడియా
– స్వతంత్ర జర్నలిస్టులపై బీజేపీ రాష్ట్రాల్లో కేసులు
– దేశద్రోహులు, అర్బన్‌ నక్సల్స్‌ అంటూ ముద్ర : ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటున్న పౌర సమాజం

ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కూడా చాలా కీలకం. ఇటీవల దేశంలో తీవ్ర చర్చకు దారి తీసిన అంశాలు ఓట్‌ చోరీ, బీహార్‌లోని స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌). అయితే ఈ రెండు అంశాలపై ప్రధాన స్రవంతి మీడియా దృష్టి సారించలేదు. కానీ ఆ పనిని స్వతంత్ర వేదికలు తమ భుజాలపై వేసుకొని అనేక వాస్తవాలను జనబాహుళ్యంలోకి తెచ్చాయి. వాస్తవాలను ప్రజలకు చెప్తున్నారనే ఒకే కారణంతో స్వతంత్ర మీడియా జర్నలిస్టులపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. బీజేపీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం,పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందనటానికి తాజా పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహరణలని మేధావులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ లేవనెత్తిన ఓట్‌ చోరీ అంశం దేశ రాజకీయ వేదికపై తీవ్ర చర్చకు దారి తీసింది. అలాగే బీహార్‌లో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్వహించిన ఎస్‌ఐఆర్‌పై కూడా రాజకీయపార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళన వ్యక్తమైంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో మొత్తం 65 లక్షల మంది ఓటర్లను తొలగించటంపై సర్వత్రా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. బతికి ఉన్నవారిని కూడా చనిపోయినట్టుగా గుర్తించి, వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇది చిన్న విషయం కాదు. కానీ దేశంలోని ప్రధాన స్రవంతి మీడియా మాత్రం ఈ అంశానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యతను ఇచ్చినట్టు కనిపించట్లేదు. దీంతో బీహార్‌లో ఓటర్లను తొలగించిన తీరు, ప్రధాన స్రవంతి మీడియా మౌనంపై పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కేవలం స్వతంత్ర జర్నలిస్టులు, సంస్థలు, సోషల్‌ మీడియా ద్వారానే ఈ అంశం ప్రజల్లోకి వెళ్లిందని వారు గుర్తు చేస్తున్నారు.

ఇండిపెండెంట్‌ జర్నలిస్టుల పరిశోధనలు
బీహార్‌ ఎస్‌ఐఆర్‌ లోపాలను ఎత్తి చూపటంలో కానీ, దానిపై దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజలకు అందించాలన్న కనీస బాధ్యతను కూడా ప్రధాన స్రవంతి మీడియా మర్చిపోయింది. కొందరు స్వతంత్ర జర్నలిస్టులు, వేదికలు ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టిని పెట్టి పరిశోధనలు చేశారు.
జర్నలిస్ట్‌ అజిత్‌ అంజుమ్‌ ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన 65 లక్షల మందిలో చనిపోయినట్టుగా గుర్తించబడినవారిపై దృష్టి పెట్టారు. మరొక జర్నలిస్టు సౌరభ్‌ శుక్లా కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి రిపోర్టింగ్‌ చేశారు. చనిపోయినట్టుగా గుర్తించబడినవారిలో చాలా మంది బతికే ఉన్నారని వీరి పరిశోధనల్లో తేలింది. చనిపోయారన్న కారణంతో ఓటరు జాబితా నుంచి తమ పేర్లు తీసేశారన్న విషయం కూడా వీరికి (ప్రజలకు) తెలియకపోవటం గమనార్హం. వీరిలో అత్యధికులు పేదలే ఉన్నారు. రాజ్యాంగం వారికి కల్పించిన హక్కును అకారణంగా తొలగించడంపై తీవ్ర వ్యతిరేకతే వ్యక్తమైంది.

మెజారిటీకంటే తీసేసిన ఓట్లే ఎక్కువ
బీహార్‌లో 25 స్థానాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీకంటే తొలగించిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆ నియోజకవర్గాల వివరాల్ని కూడా స్వతంత్ర జర్నలిస్టులు అన్ని అధారాలతో వివరించారు. ఈ 25 స్థానాల్లో 18 సీట్లు అధికార బీజేపీ-జేడీ(యూ) కూటమికి చెందినవే కావటం గమనార్హం. రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ అనే న్యూస్‌పోర్టల్‌ కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలోని లోపాలు, అవకతవకలను బయటపెట్టింది. ఒకే చిరునామాలపై 20 మంది పేర్లు ఉన్నాయనీ, ఇలా 80వేల ఓటర్లు ఉన్నారన్న విషయాన్ని తన నివేదికలో వివరించింది. ఇక న్యూస్‌లాండ్రి తన తాజా నివేదికలో వేర్వేరు కులాలు, మతాలకు చెందిన వంద మందికి పైగా ఓటర్లు ఒకే ఇంటిలో నివసిస్తున్నట్టు కనుగొన్నది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని స్వతంత్ర నివేదికల్లో తేలింది.

బీజేపీ నుంచి ఫిర్యాదులు.. జర్నలిస్టులపై కేసులు
ఓటర్ల జాబితాల్లోని వాస్తవాలను బటయకు తెచ్చిన స్వతంత్య్ర జర్నలిస్టులు, సంస్థలపై బీజేపీ నేతలు ఫిర్యాదులు చేయడం, పోలీసులు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. ఇలా కేసులు పెట్టబడిన జర్నలిస్టుల్లో ది వైర్‌కు చెందిన సిద్ధార్థ్‌ వరదరాజన్‌, ప్రముఖ జర్నలిస్టు కరణ్‌ థాపర్‌లతో పాటు సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను నడిపే జర్నలిస్టు అభిసర్‌ శర్మలు ఉన్నారు. ఈ ముగ్గురిపై బీజేపీ పాలిత రాష్ట్రం అసోంలోనే కేసులు నమోదయ్యాయి. జర్నలిస్టులపై ఫిర్యాదులు, కేసులు దాఖలు చేస్తున్నవారు బీజేపీ, దాని అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీకి చెందినవారే కావడం గమనార్హం. వ్యవస్థలోని లోపాల్ని బయటకు తెచ్చిన స్వతంత్ర జర్నలిస్టుల నివేదికలపై మోడీ సర్కారు భయపడుతోందనీ, అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమ కేసులు బనాయిస్తున్నారని పౌరసమాజం భావిస్తోంది. జర్నలిస్టులపై దేశ వ్యతిరేకులు, అర్బన్‌ నక్సల్స్‌ అంటూ జైలులో పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad