ఉదయం 10.30 గంటలకు ప్రారంభం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
మాగంటి గోపీనాథ్‌కు సంతాపం
అనంతరం వాయిదా
మధ్యాహ్నం క్యాబినెట్ భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు శాసనసభ, మండలి కొలువుదీరనున్నాయి. ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. ఆయనకు నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, బీఆర్‌ఎస్ సభ్యులు ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమై అసెంబ్లీని ఎన్ని రోజులు నడపాలనే విషయమై చర్చించి, ఒక నిర్ణయానికి వస్తుంది. సమావేశాలను నాలుగైదు రోజులపాటు నిర్వహించే అవకాశముందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభా సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభలోని ఎమ్మెల్యేలందరికీ ఆ నివేదిక కాపీలను అందజేయనున్నారు. మండలిలో ఎమ్మెల్సీలకు కూడా ఆ కాపీలను అందజేస్తారు.
మరోవైపు శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లే ప్రధాన అజెండాగా క్యాబినెట్ భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై కూడా క్యాబినెట్ చర్చించనుంది.
ఢీ అంటే ఢీ…
కాళేశ్వరం కమిషన్ రిపోర్టును శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉభయ సభల్లో వాడివేడి చర్చ జరగనుంది. రిపోర్టు ఆధారంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు అధికార పక్షం కాంగ్రెస్ వ్యూహాలను పన్నుతుండగా, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ సమాయత్తమవుతోంది. అధికార పార్టీ ఎదురుదాడి చేయనున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారైనా సభకు వచ్చి ఆ దాడిని తిప్పికొడతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై తెలంగాణ భవన్ నుంచి గానీ, బీఆర్‌ఎస్ వైపు నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడకపోవటం గమనార్హం. ఒకవేళ కేసీఆర్ సభకు రాకపోతే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆ బాధ్యతను భుజానికెత్తుకుని కాళేశ్వరం రిపోర్టుపై తమ పార్టీ తరపున చర్చలో పాల్గొని, వాదనలను సమర్థవంతంగా వినిపించాల్సి ఉంటుంది. ఈ అంశంపై సభలో తమకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీపీ)కు అవకాశమివ్వాలంటూ ప్రధాన ప్రతిపక్షం స్పీకర్‌కు ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ సర్కారు అనుమతినివ్వకపోతే అదే అదనుగా సభలో ఆందోళన చేపట్టాలని బీఆర్‌ఎస్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో సభ మరింత హీటెక్కటం ఖాయంగా కనబడుతోంది.
మండలిలో కవితక్క.. రాములక్క…
మరోవైపు శాసన మండలి కూడా ఈసారి హాట్‌హాట్‌గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ వివిధ అంశాలపై మాట్లాడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతీసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే అధికార పక్షం నుంచి ఈసారి సినీ నటి విజయశాంతి కూడా మండలిలో అడుగుపెట్టనున్నారు. ఆమె ప్రభుత్వం తరపున విపక్షాలపై ఎదురుదాడికి దిగితే సమావేశాలు మరింత ఆసక్తికరంగా మారటం ఖాయం. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కవిత, ఈనెల 31న స్వదేశానికి రానున్నారు. అందువల్ల ఆమె ఆ తర్వాతే సభకు హాజరుకానున్నారు. కాగా మొన్నటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్… సుప్రీంకోర్టు స్టేతో ఈసారి సభకు దూరం కానున్నారు.
నేటి నుంచి అసెంబ్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES