Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమెదక్‌లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు

మెదక్‌లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు

- Advertisement -

డిసెంబర్‌ 7నుంచి 9వరకు నిర్వహణ
లోగోను ఆవిష్కరించిన నేతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలు డిసెంబరు ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు మెదక్‌లో జరగనున్నాయి. ఆ మహాసభలకు సంబంధించిన లోగోను శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాట్లు చేస్తున్నదనీ, ఈ మహాసభల సందర్భంగా ప్రతి గ్రామంలో సీఐటీయూ అనుబంధ సంఘాల సభ్యులతో, అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులతో సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ సీఐటీయూ అగ్ర భాగాన ఉందన్నారు. ఈ రోజు కాంట్రాక్టు కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా అనేక పరిశ్రమల్లో కూడా సీఐటీయూ పోరాడుతున్నదనీ, కార్మికులకు అండగా నిలబడుతున్నదని చెప్పారు. అలాగే స్కీమ్‌ వర్కర్లు మొదలుకొని ప్రభుత్వ రంగ కార్మికుల సమస్యల వరకు అన్ని తరగతుల కార్మికుల సమస్యలపై నిలబడుతూ కార్మికులను సంఘటితం చేయడం, వారి హక్కులను కాపాడటం, ఉద్యోగ భద్రత తదితర విధానపర అంశాల్లో కూడా సీఐటీయూ కార్మిక పక్షపాతిగా నిలుస్తోందని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో జరుగుతున్న రాష్ట్ర ఐదో మహాసభలు రాబోయే కాలంలో తెలంగాణలో కార్మిక వర్గం నిర్వహించే పోరాటాలకు భూమికకానుందని తెలిపారు. మెదక్‌లో జరిగే మహాసభల్లో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించబోతున్నామని వివరించారు. కార్మిక వర్గం, శ్రేయోభిలాషులు, మేధావులందరు కూడా ఈ మహాసభల జయప్రదానికి సహకరించాలనీ, ఆహ్వాన సంఘం చేసే ఏర్పాట్లకు మెదక్‌ పట్టణ ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. మహాసభల లోగో ఆవిష్కరణలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకులు పి.రాజారావు, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు ఎస్‌.వీరయ్య, జె.వెంకటేష్‌, ఎస్వీ రమ, కళ్యాణం వెంకటేశ్వరరావు, టి.వీరారెడ్డి, వంగూరు రాములు, కె.ఈశ్వర్‌ రావు, ఎం.పద్మశ్రీ, బి.మధు, వి.ఎస్‌.రావు, కురపాటి రమేష్‌, కాసు మాదవి, ఆహ్వాన సంఘం వైస్‌ చైర్మెన్‌ అడివయ్య, సీఐటీయూ మెదక్‌ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -