వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ వద్ద భారీ నిరసన ప్రదర్శన
వెనిస్ (ఇటలీ) : గాజాపై ఇజ్రాయిల్ దురాక్రమణను నిరసిస్తూ వేలాది మంది ప్రజలు శనివారం వెనిస్ చలనచిత్రోత్సవ వేదిక సమీపంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇటలీ ఈశాన్య ప్రాంతంలోని వామపక్ష రాజకీయ గ్రూపులు ఈ నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించాయి. గాజాలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై చలనచిత్ర పరిశ్రమ దృష్టి సారించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. చలనచిత్రోత్సవానికి హాలీవుడ్ పరిశ్రమలోని హేమాహేమీలు హాజరవుతుండగా ఆ వేదికకు కొన్ని కిలోమీటర్ల దూరంలో సాయంత్రం ప్రదర్శన ప్రారంభమైంది. ‘మారణహోమాన్ని ఆపండి’ అని రాసివున్న బ్యానర్లు చేబూని వారంతా నెమ్మదిగా కదులుతూ ఉత్సవం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. వెనిస్‌లో జరిగే చలనచిత్రోత్సవం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. ఇందులో ప్రదర్శించే చిత్రాలు తరచూ ఆస్కార్ అవార్డులకు పోటీ పడతాయి. ‘వినోద పరిశ్రమ అనేక మందిని ఆకర్షిస్తుంది. కాబట్టి అందులోని వారు గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న దాష్టీకాలను ఎండగట్టాలి’ అని 31 సంవత్సరాల కంప్యూటర్ శాస్త్రవేత్త మార్కో సియోటోలా కోరారు. గాజాలో జరుగుతున్న దానిని ప్రతి ఒక్కరూ మారణహోమం అని చెప్పాల్సిన అవసరం లేదని, కానీ ఏదో ఒక వైఖరిని తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇది రాజకీయ పరిస్థితి కాదని, మానవ పరిస్థితి అని ఆయన తెలిపారు. గాజాలో ఏం జరుగుతుందో మనకు తెలుసునని, కానీ దానిని కొనసాగనివ్వడం మంచిది కాదని క్లౌడియా పొగ్గీ అనే ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు. ప్రదర్శనలో భాగస్వాములైన వారందరూ పాలస్తీనాకు విముక్తి కలిగించాలంటూ నినాదాలు చేశారు. ఇజ్రాయిల్ చర్యలను ఖండించాలని, యుద్ధానికి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పాలని కోరుతూ రెండు వేల మందికి పైగా సినీ కళాకారులు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. దీనిపై వీనస్ చలనచిత్రోత్సవంలో చర్చ జరగాలని వారు కోరుకుంటున్నారు. మేలో జరిగిన కేన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు.
మారణహోమం ఆపండి
- Advertisement -
- Advertisement -

                                    

