– పొంగుతున్న వాగులు
– పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేత
– ఖమ్మం వద్ద పెరుగుతున్న మున్నేరు
నవతెలంగాణ – ఖమ్మం డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది. సుమారు రాత్రి 12 గంటల నుండి సోమవారం తెల్లవారు వరకు ఎడతెరిపి లేకుండా వర్షం రావడంతో జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మం వద్ద మున్నేరు వాగు క్రమక్రమంగా పెరుగుతుండడంతో సిపి సునీల్ దత్ ఆదేశాల మేరకు త్రీ టౌన్ ఇన్ స్పెక్టర్ భాను ప్రకాష్ పరిశీలించారు.
వాగును చూసేందుకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. చింతకాని మండలం రామకృష్ణాపురం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఖమ్మం – బోనకల్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురం వద్ద వాగు పై నుండి నీరు ప్రవహిస్తుoడ డంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. రోడ్డుకు ఇరువైపుల భారీ గేట్లు ఏర్పాటు చేశారు. కామేపల్లి మండలం పొన్నెకల్లు వద్ద బుగ్గ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొత్త లింగాల – పొన్నకల్ గ్రామాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఏన్కూరు మండలం రేపల్లెవాడ – నాచారం గ్రామాల మధ్య వాగు పొంగి ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిపివేశారు.