అపశృతులకు తావులేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశం
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య, ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యంచ శివారులోని గోదావరి బ్రిడ్జి వరకు గల మార్గాన్ని కలెక్టర్, సీ.పీ నిశితంగా పరిశీలన జరిపారు. అక్కడక్కడా చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి భిగించాలని సూచించారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా ఎనిమిది అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఉమ్మెడ మార్గాన్ని, బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. యంచ గోదావరి బ్రిడ్జి తో పాటు, ఉమ్మెడ వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం కోసం సరిపడా క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జనరేటర్, అంబులెన్సు, మెడికల్ క్యాంపు లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిమజ్జనోత్సవంలో ఏ చిన్న అపశ్రుతి జరగకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా, నిజామాబాద్ నగరంలో శోభాయాత్ర కొనసాగే దుబ్బా ప్రాంతం నుండి వినాయక బావి వరకు గల ప్రాంతాలను సైతం కలెక్టర్, సీ.పీలు సందర్శించారు. వినాయక బావి వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులతో కలిసి నిమ్మజన ఏర్పాట్ల విషయమై కలెక్టర్, సీ.పీ సమాలోచనలు జరిపారు. వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర నిర్వహించుకోవాలని సూచించారు.
ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా, నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్, ఫైర్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్కో, పంచాయతీరాజ్, ఫిషరీస్, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఉన్నందున ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన భారీ విగ్రహాలను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిమజ్జనానికి ఉమ్మెడ గోదావరికి తరలించాలని సూచించారు. ఈ మేరకు ఉమ్మెడ వద్ద కూడా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని, వారి సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, భైంసా డివిజన్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ రావు, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉన్నారు.