వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాదు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : కార్మిక చట్టాల రక్షణకు, నాలుగు లేబర్ కోడ్ రద్దు కొరకు మే 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెతో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో ఉన్న బంధాన్ని బట్టబయలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాదు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి. వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా పేద ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పనిని చట్టబద్ధం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ను ప్రతితను కఠిన తరం చేసి కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వాటిని తిప్పికొట్టేందుకు కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ అనుకూల కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పుకొట్టాలని పోరాడి సాధించుకున్న చట్టాలను హక్కులను కాపాడుకోవాలని కోరారు. ఈ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిఐటియు ఐఎన్టీయూసీ,ఏఐటియుసి, , బిఆర్టియు, టియుసిఐ, ఐఎఫ్టియు, హెచ్ఎంఎస్, టిఎన్టియుసి,ఏ ఐయుటియుసి, కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సంఘాల అసోసియేషన్లు మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ బందును విజయవంతం చేయాలని కోరారు.
20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES