Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజి'ఆమె'కు రక్షణేది?

‘ఆమె’కు రక్షణేది?

- Advertisement -

రాత్రికి దానికంటూ ఒక అందం వుంది. ఒక ప్రత్యేకమైన గుర్తింపు వుంది. రాత్రిపూట కవిత్వం కురుస్తుంది. ‘రాత్రి అందాలను ఎప్పుడూ అనుభవించనివాడు నిజమైన కవి/ కళాకారుడు కాలేడు’ అంటారో రచయిత. రాత్రిపూట ప్రపంచం ఒక కలలా అనిపిస్తుంది. ‘స్నానం చేసి తలారబోసినట్లు ఆకాశంలో నల్లటి చీకటి’ అంటూ రాత్రి సౌందర్యాన్ని వర్ణిస్తాడు శీలా వీర్రాజు ఓ కథలో. లెక్కలేనన్ని ఆలోచనలు, చిత్రాలు, రూపకాలు, దు:ఖాలు, భయాలు రూపుదిద్దుకుంటాయి చీకటిలో. అర్థరాత్రి ఆకాశం కింద ఫుట్‌పాత్‌లు రూపాంతరం చెందుతాయి. వెన్నెల వికసిస్తుంది. నల్లని తారురోడ్లపై మృదువైన కిరణాలు నృత్యం చేస్తుంటాయి. అలసిన శరీరానికి, మనసుకు చంద్రుని వెలుగులో ఓదార్పు లభిస్తుంది. ఇంత అందమైన రాత్రి, స్త్రీలకు ఎందుకు చెడ్డదిగా, ప్రమాదకరమైనదిగా పరిగణించ బడుతుంది? అమ్మాయిలు పురుషులతో సమానంగా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించగల ఈ సమాజంలో తమ కలలను సాకారం చేసుకోడానికి నిజంగా స్థలం లేదా? ‘యత్ర నార్యన్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా:’ అంటూ మహిళలను దేవతలుగా పూజిస్తారు. అదే సమాజం నిజ జీవితంలో వారికి స్వేచ్ఛ, భద్రత, గౌరవం లేకుండా చేస్తున్నది. స్త్రీల పట్ల ఈ కపటత్వం ఎందుకు? పండు వెన్నెలయినా, వీధి దీపాలైనా రోడ్లను ప్రకాశవంతం చేస్తాయి. కానీ చాలా మంది మహిళలకు ఈ చీకటి రాత్రులు కాళరాత్రిని తలపిస్తాయి. ఇంటికి వెళ్లే మార్గాన్ని భయం కబళించివేస్తుంది. జాతీయ వార్షిక నివేదిక మహిళల భద్రత సూచీ (ఎన్‌.ఎ.ఆర్‌.ఐ)-2025 ఈ విషయాన్ని ధృవీకరించింది.

దేశంలోని 31 నగరాల్లో సర్వే చేసిన జాతీయ మహిళా కమిషన్‌ ‘నారీ సూచీ-2025’ నివేదికను విడుదల చేసింది. ప్రతి ముగ్గురిలో ఒకరు వేధింపులకు గురవుతుండగా, నలభై శాతం మంది మహిళలు సురక్షితంగా లేమని ఫీలవుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. రాత్రి వేళల్లో ముఖ్యంగా ప్రభుత్వ రవాణా మార్గాల్లో, వినోద ప్రదేశాల వద్ద భద్రతకు సంబంధించిన అవగాహనలో తీవ్రమైన తగ్గుదల వుందని ఈ అధ్యయనం తెలిపింది. మహిళలకు రక్షణ లోపించిన నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ వుండటం గమనార్హం. నాణేనికి రెండోవైపు అన్నట్లు.. ఇంటి బయటే కాదు, ఇంట్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే వుంది. అదనపు కట్నం కోసమో, అనుమానంతోనో, తనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నదనో భార్యను హింసించడం, హతమార్చడం సర్వసాధారణంగా మారింది. ‘భార్యాభర్తలన్నాక ఇదంతా మామూలే కదా..’ అన్నాడు గ్రేటర్‌ నోయిడాలో భార్యను హత్యచేసిన తర్వాత.. విపిన్‌ భాటీ అనే ఓ ఘనాపాటి. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ హింసకు గురౌతోంది. దేశాభివృద్ధి కేవలం జీడీపీ గణాంకాల్లో వస్తే చాలదు.. మన ఆలోచనా విధానంలో రావాలి. ఈ వికృత ధోరణులను పెంచి పోషి స్తోన్న వినిమయదారీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి. ‘మహిళ స్వేచ్ఛ హక్కు మాత్రమే కాదు, అది సమాజ ఆత్మకు శ్వాస’ అంటారు సరోజిని నాయుడు.

దేశంలో సామాజిక కట్టుబాట్లూ, సంప్రదాయాలు మహిళల్ని కట్టిపడేసినంతగా..మగవాళ్లను పట్టించుకోవడం లేదు. ‘విపిన్‌ భాటీ లాంటి వాళ్లు భార్యను హింసించడం మామూలే అన్న ధోరణిని చూసీచూడనట్లుగా వుండటమో, చూసీ మౌనంగా వుండిపోవడమో అంటే, పరోక్షంగా మనమంతా ఈ నేరాలను సమర్థిస్తున్నట్లుగా, భాగస్వాముల మైనట్లుగానో భావించాల్సిందే’ అంటారో సామాజికవేత్త. ఐరాస చెప్పినట్లు.. మహిళలపై జరుగుతున్న హింసను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి. సమాజంలో మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న విష సంస్కృతి పట్ల ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి. ‘నేను ఆకాశాన్ని చేరుకున్నాను. కానీ, ప్రతి మహిళా భయం లేకుండా భూమిపై నడవగలగడం మరింత గొప్ప విజయమవుతుంది’ అంటారు కల్పనా చావ్లా. మహిళ సురక్షితురాలు అయితేనే సమాజం సుసంపన్నం అవుతుంది. ఆమె భవిత కాంతివంతమైతేనే, దేశ భవిష్యత్‌ ఉజ్వలమౌతుంది. తమ బిడ్డలకు రాత్రిపూట భయపడకుండా.. ‘వెళ్లి చంద్రుడిని చూడండి, వెన్నెల్లో వీచే చల్లగాలిని ఆస్వాదించండి, స్వేచ్ఛగా జీవించండి’ అని గర్వంగా చెప్పగలిగే పరిస్థితిని సృష్టిద్దాం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad