రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటినుండి ప్రభుత్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దుతానని కొన్నిచేదు వాస్తవాలతో, మరికొన్ని తీపి మాటలు చెప్పారు. ప్రభుత్వరంగంలో పూర్తివిద్య కొనసాగించిన ఆయనకు ప్రభుత్వ పాఠశాలలపట్ల ఉన్న స్వీయ అనుభవం, ఆదిశగా ఆలోచించడానికి కూడా అవకాశం ఉంది. అయితే తెలంగాణా విద్యావ్యవస్థ గురించి చేసిన సిపార్సులు, ఆలోచనలు ఆచరణాత్మకంగా ముందుకు పోవడం లేదు? ”రెడ్డి వచ్చే మళ్లీ మొదలయ్యె!” అన్నా సామెతగా తయారైంది పరిస్థితి. అందుకు విద్యారంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలోనే స్పష్టత లేదు.ఏదో గందరగోళం గోచరిస్తుంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేండ్ల కాలంలో సరైన ప్రణాళిక లేక ప్రభుత్వ పాఠశాలల నమోదు క్షిణించింది. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం దివాళా తీసిన ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల భవనాలు అద్దెకు తీసుకుని రెసిడెన్షియల్ పాఠశాలలు కులాల ప్రాతిపదికన ఏర్పరచడం వలన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు క్రమంగా క్షీణించింది. ఉన్న పాఠశాల వసతులు వాడుకుని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఉంటే కొంతలో కొంతైనా ప్రభుత్వ విద్యారంగం గాడిలో పడేది. అలా చేయకపోవడం వలన రెంటికీ చెడ్డ రేవడిగా తయారైంది.
రాష్ట్ర విద్యాప్రమాణాలు దేశంలోనే 31వ స్థానంలోకి దిగజారాయి.
2024 యుడైస్ గణాంకాలును అనుసరించి 30,022ప్రభుత్వ పాఠశాలల్లో 27లక్షల79వేలమంది విద్యార్థులు ఉన్నారు.నూతనంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలో ఓ విద్యా కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్ తెలంగాణా అంతటా విస్తృతంగా పర్యటించి ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, విద్యారంగ మేధావులు, నిపుణుల అభిప్రాయాలతో ఓ నివేదిక సమర్పించింది. అందులో 19వేల పైచిలుకు ప్రాధమిక పాఠశాలల్లో 13వేల పాఠశాలలు 50 మంది పిల్లలకంటే తక్కువ సంఖ్యలో ఉన్నారని విద్యా కమిషన్‌నే తన నివేదికలో పొందుపరిచింది.ఇక ఐదు వేల పైచిలుకు ఉన్నత పాఠశాలలు,నాలుగు వేల పైచిలుకు ప్రాథమికోన్నత పాఠశాలలు పరిస్థితి ఇంచుమించు అదే పరిస్థితి. వనరులున్నా ప్రభుత్వ బడుల్లో పిల్లల నమోదు లేదు.కొన్ని ప్రభుత్వ బడులు మూతపడగా, మరికొన్ని అదేస్థితికి దగ్గరగా ఉన్నాయి.ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పుడ్ పాయిజనింగ్ కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి.గత ఏడాదిన్నర కాలంలోనే ఓ వెయ్యి మంది విద్యా ర్థులు పుడ్ పాయిజనింగ్‌తో ఆస్పత్రి పాలు కాగా, 50మంది వరకు మరణించినట్లు వార్తలు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నింట కనీస మౌలిక వసతులు లేవు? బోధనా సిబ్బంది ఉన్నచోట పిల్లలు లేరు, పిల్లలున్న చోట సరైన వసతులు లేవు.ఈరకమైన నిరుపయోగితా క్రమం ప్రభుత్వ బడుల్లో నెలకొంది.
ఈపరిస్థితిలోనే తెలంగాణా విద్యా కమిషన్ తన నివేదికను అందించింది. ఆ నివేదికలో ఇప్పుడున్న పాఠశాలల స్థానంలో మండలానికి మూడు తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ (2నుండి 12 తరగతుల వరకు), నాలుగు ఫౌండేషన్ స్కూల్స్ (ప్లేతరగతుల నుండి 3వ తరగతి వరకు) ఏర్పరచాలని, పాఠశాల లేని గ్రామాలు లేదా క్యాచ్‌మెంట్ ఏరియా నుండి ఉచిత ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం సిఫార్సు చేసింది. రూ.31,700 కోట్లతో 634మండలాల్లో ఆరేండ్ల కాలపరిమితిలో ఏటా ఐదువేల కోట్లతో వందమండలాల బడుల రూపురేఖలు మార్చడం కోసం, నాణ్యమైన, అవసరమైన విద్యకు ప్రణాళిక రూపొందించింది. ఉన్న పాఠశాలలో సంస్కరణ దిశగా నివేదిక ఇచ్చింది.బడ్జెట్‌కు ముందే నివేదిక అందజేసిన ప్పటికీ, మనరాష్ట్ర బడ్జెట్‌లో దీనికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ప్రయోగాత్మకంగా రెండు మండలాల్లో అమలుకు అంగీకారం మాత్రం తెలిపారు.ఇదిలా ఉండగానే విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం రూపొందించిన 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు కోసం 2024 పిభ్రవరిలోనే ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. 25ఎకరాల స్థలం, 2600మంది విద్యార్థు ల కెపాసిటీతో120మంది ఉపాద్యాయులు ఒక్కో పాఠశాలకు రూ.200కోట్ల చొప్పున 200 పాఠశాలల ఏర్పాటుకు 40వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇటీవల ఉస్మానియా యూనివర్సి టీలో జరిగిన సభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు మూడువేల ఎకరాల పైచిలుకు ఉన్న విలువైన భూములు, రెండు లక్షల కోట్ల నిధులతో గత 20 ఏం డ్లుగా సర్వశిక్షా అభియాన్ నిర్మించిన తరగతి గదులు ఉండగా, మరో ఐదువేల ఎకరాలు, మరికొన్ని వేల కోట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలకు అవసరమా?అన్నా చర్చా కొనసాగుతుంది. ఇటీవలనే ఎలాంటి కసరత్తు లేకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఉత్తర్వులు ఎంతవరకు అమలు జరిగాయో సమీక్షలేదు? ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సలహాదారు కె.కేశవరావు ఇటీవలకాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలను విద్యారంగంలో ప్రవేశపెట్టే పనిలో ఉన్నారు. ఈఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో 23వేల కోట్లు మాత్రమే కెేటాయించారు. అందులో ఒక అంచనా ప్రకారం 18వేల కోట్లపైచిలుకు విద్యారంగంలో పనిచేస్తున్న బోధనా,బోధనేతర ఉద్యోగుల వేతనాలకు ఖర్చవుతాయి. మిగిలిన ఐదువేల కోట్లలో ఉన్నత విద్య, పాఠశాల గ్రాంట్లు, మధ్యాహ్న భోజనానికి పోతే నూతన ప్రణాళికకు మిగిలేది ఎంత? ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరగకపోగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు లేవు? సరికదా! ఇప్పుడు విద్యారంగం పాలసీ రూపొందించడం కోసం పూర్వాశ్రమంలో కేసీఆర్ సలహాదారైన కె.కేశవరావు చైర్మన్‌గా, సభ్యులుగా ఆకునూరి మురళి, కడియం శ్రీహరి, రామకృష్ణరావు, బాలకృష్ణారెడ్డి, యోగితా రాణాలతో మరోకమిటీ వేసింది. ఈకమిటీ పాలసీ రూపొందించడానికి మరెంత కాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేం!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో విద్యావ్యవస్థలో ఇన్ని పిల్లిమొగ్గలు అవసరమా? ప్రజాస్వామ్య బద్దంగా సమాచారం సేకరించి నివేదిక ఇచ్చిన ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యాకమిషన్ సిఫార్సులు పక్కన పెట్టి , మరలా విద్యాపాలసీ రూపకల్పన పేరుతో కమిటీ వేయడం కాలయాపనకేనా?ఈ సందేహం ఎవరికైనా వస్తుంది. ఏ కమిటీ అయినా తాము చేసిన సిపార్సుల అమలుకు ఆర్థిక పరిపుష్టి ముఖ్యం. దీనికితోడు అమలు చేయలన్నా చిత్తశుద్ధి. ఇప్పుటికే పూర్తి పడకస్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించి బోధనా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అలాగే విద్యార్థుల నమోదు శాతం పెంచడం, నాణ్యమైన, ఉపయోగకరమైన విద్యా సంస్కరణలు చేసే దిశగా నూతన విద్యా కమిటీ కృషిచేయాలి. అంతేకానీ, అశాస్త్రీయ విద్యను జొప్పించే కేంద్రం తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఇపి)కి అనుకూల విధానాలు అవలంభిస్తే గనుక, విద్యారంగం మరింత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కమిటీలను కాలయాపన కోసం వాడుకోవడం కాకుండా గతంలో కమిటీ ఇచ్చిన నివేదికను, ఇప్పుడు కొత్త కమిటీ సూచనలు కూడా విద్యావేత్తలతో చర్చించి అమలుచేసే దిశగా ముందుకు సాగాలి.
ఎన్.తిర్మల్
9441864514