– సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు
– ప్రజలు సహకరించాలి..
– భయాందోళనలకు గురికావొద్దు
– నోడల్ అధికారిగా నాగిరెడ్డి : అర్వింద్‌కుమార్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో సైతం బుధవారం మాక్‌డ్రిల్(సివిల్ అభియాన్)ను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసిందనీ, మొత్తం ఐదు చోట్ల నిర్వహించనున్నామని సీనియర్ ఐపీఎస్ అధికారి అర్వింద్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యంత ప్రాధాన్యత గల జాబితాలో ఉన్న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంటోన్మెంట్, కంచన్‌బాగ్, నాచారంలలో ఈ మాక్‌డ్రిల్ సాగుతుందని పేర్కొన్నారు. దీనికి సివిల్ డిఫెన్స్ డైరెక్టర్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి పర్యవేక్షణాధికారిగా ఉంటారని తెలిపారు. పోలీసు, ఫైర్ సర్వీస్, ఎన్డీఆర్‌ఎఫ్, డీఎమ్, ఈ మాక్‌డ్రిల్‌లను నిర్వహిస్తాయని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు ఈ డ్రిల్ సాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలెవ్వరూ భయభ్రాంతులకు గురికావొద్దనీ, మాక్‌డ్రిల్‌కు సహకరించాలని కోరారు. పెహల్గాంలో ఉగ్రవాద మూకల ఘటన తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
ఉగ్రవాదుల సెల్టర్ జోన్‌గా మారిన పాకిస్తాన్‌పై ఇప్పటికే సింధూజలాల నిలిపివేత మొదలుకుని పలు ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం విధించిన విషయం విదితమే. రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే అందుకు తగిన విధంగా ప్రజలను కూడా సన్నద్ధం చేసే ప్రక్రియకు కేంద్రం పూనుకున్నది. 1971లో పాక్‌తో యుద్ధం జరిగిన సమయంలో సివిల్ డిఫెన్స్ విభాగాలను అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేసి ఎయిర్‌రైడింగ్ జరిపి ప్రజలు తమను తాము కాపాడుకునేలా కేంద్రం మాక్‌డ్రిల్ చేపట్టింది. ఇన్నేండ్ల తర్వాత మళ్లీ మాక్‌డ్రిల్ ప్రయోగాన్ని చేపట్టనున్నది. బుధవారం సాయంత్రం 4 గంటలకు యుద్ధ సమయంలోనే మాదిరిగానే సైరన్ మోగించి మాక్ డ్రిల్ చేపడుతారు.
మాక్‌డ్రిల్ కార్యక్రమాలు.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇండిస్టీయల్ సైరన్లు, పోలీసు మైకులు(చౌరస్తాల వద్ద) సరిగ్గా 4 గంటలకు వినిపిస్తారు.
– నగరంలో ఒకేసారి రెండు నిమిషాల పాటు పోలీస్, ఫైర్, మెడికల్ సైరన్లు మోగుతాయి.
– సైరన్ విన్న వెంటనే వేగంగా, శాంతంగా స్పందించాలి
– తక్షణం ఆశ్రయం పొందడం కోసం బహిరంగ ప్రదేశాల నుంచి తప్పించుకుని షెల్టర్‌లోకి వెళ్లాలి.
– పుకార్లను పట్టించుకోకుండా అధికారుల సూచనలను మాత్రమే అనుసరించాలి
– ఇండ్లలో గ్యాస్, ఎలక్ట్రికల్ పరికరాలు ఆఫ్ చేయాలి.
– ప్రమాదం తీరినట్టు అధికారులు ప్రకటించే దాకా ఆశ్రయంలోనే ఉండాలి.
– దగ్గర్లో ఆశ్రయం లేకపోతే తక్కువ ప్రదేశంలో నక్కి తలను కప్పుకోవాలి. తగినరీతిలో రక్షణ పొందేందుకు ప్రయత్నించాలి.
నేడు హైదరాబాద్‌లో ఐదుచోట్ల మాక్‌డ్రిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES