– గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ నిర్మాణాలు నేల మట్టం
– మైలార్‌దేవ్‌పల్లిలోనూ కొనసాగిన కూల్చివేతలు
– భారీ పోలీస్ బందోబస్తు మధ్య కట్టడాల కూల్చివేత
నవతెలంగాణ-శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్
అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝూళిపిస్తోంది. అక్రమ కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేస్తోంది. తాజాగా మంగళవారం రంగారెడ్డి జిల్లా గచ్చిచౌలి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చి వేయించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ నిర్మాణంపై మొదటి నుంచి కూడా వివాదం కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 124, 127లో ఫర్టిలైజర్ కార్పొరేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పేరుతో సుమారు 20 ఎకరాల్లో ప్లాట్లు చేసి అమ్మగా.. వాటిలో 162 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. సంధ్యా కన్వెన్షన్ అక్రమంగా వీరి ప్లాట్‌లను కబ్జా చేసి రోడ్లు వేసి, భారీ నిర్మాణాలు చేపట్టింది. ఫుడ్ కోర్టులు, మినీ హల్, భారీ షెడ్‌లు నిర్మించింది. మూడు అంతస్థుల నిర్మాణాలు చేపట్టారు. సొసైటీ స్థలంతో పాటు పక్కనున్న స్థలం కూడా కబ్జా చేశారని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే ఒకసారి కూల్చివేశారు. అయినా ఈ కబ్జా పర్వం కొనసాగింది. వీటిపై సొసైటీ వారు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి మంగళవారం ఉదయం నుంచి పెద్ద, పెద్ద మూడు హిటాచ్‌లతో కూల్చివేతలు చేపట్టారు. ఉదయమే నుంచే భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని ఇందిరాగాంధీ సొసైటీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గతంలో ఇందిరాగాంధీ సొసైటీలో రోడ్డును ఆక్రమించి ఒక వ్యక్తి భారీ షెడ్ల నిర్మాణం చేపట్టాడు. ఇటీవల సొసైటీ సభ్యులు ఈ విషయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆ షెడ్లను తొలగించాలని యజమానికి నోటీసులు అందజేశారు. అయినా యజమాని తొలగించకపోవడంతో మంగళవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని హైడ్రాధికారులతో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు యజమానిని అక్కడి నుంచి పంపించారు. పూర్తిగా రోడ్డుపై నిర్మించిన షెడ్లను కూల్చివేశారు. అలాగే, గగన్‌పహాడ్‌లోనూ అనుమతులు లేకుండా నిర్మించిన పలు షెడ్లను అధికారులు కూల్చివేయించారు.
అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES