కడపలో నేటి నుంచి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు
‘ఉపాధి’ కార్మికులకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలి
మతోన్మాద నిరోధం, రాజ్యాంగ పరిరక్షణపైనా చర్చిస్తాం
9న ఢిల్లీలో భారీ కన్వెన్షన్ : బి వెంకట్
కడప : అమెరికా వాణిజ్య సుంకాల లక్ష్యం ఫ్రీ ట్రేడ్ ద్వారా తమ ఉత్పత్తులను గుమ్మరించడమేనని, అమెరికా ఒత్తిళ్లకు లొంగితే దేశీయ వ్యవసాయానికి మరణశాసనం రాసినట్లేనని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి గోధుమ, డెయిరీ, కోళ్ల ఉత్పత్తులు భారతీయ మార్కెట్లను ముంచేస్తాయన్నారు. ఉపాధి హామీ చట్టానికి నిధులను నాలుగు శాతం నుంచి 1.37 శాతానికి కుదించడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఉపాధి కార్మికులకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడపలో తొలిసారిగా ఈ నెల ఎనిమిది నుంచి పదో తేదీ వరకు మూడు రోజుల పాటు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మతోన్మాద నిరోధం, రాజ్యాంగ పరిరక్షణ, అంటరానితనం నిర్మూలన కోసం కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. దేశంలో కుల, మతోన్మాదాల్ని ప్రేరేపించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి మత, చాతుర్వర్ణ రాజ్యాంగాన్ని తేవాలనే కుట్ర జరుగుతోందన్నారు.
ఉపాధి హామీకి ఆధార్ అనుసంధానం వల్ల ఏడు కోట్ల మంది ఉపాధి గల్లంతు కావడంపై జాతీయ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్… ఉపాధి హామీలో టెక్నికల్ మార్పులు తెస్తున్నారని, అమెరికా సిస్టమ్ అమలు చేయడం సరికాదని తెలిపారు. ఇటువంటి అంశాలపై ఈ నెల తొమ్మిదిన ఢిల్లీలో అఖిల భారత స్థాయిలో కన్వెన్షన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ, కార్మిక, రైతు సంఘాలను, ఇతర కలిసివచ్చే సంస్థలను, సంఘాలను కలుపుకుని సమరశీల ఉద్యమానికి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. కంపెనీ వ్యవసాయాన్ని తీసుకురావడమే మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని, అభివృద్ధి పేరుతో భూములను లాక్కోవడం విధానంగా మారిందని అన్నారు. ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికీ రెండు ఎకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రేవంత్, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ధోరణి దేశానికి నష్టాన్ని కలిగిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని 2.30 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తోన్న రైతు సంఘం నాయకులు కె.ప్రభాకర్‌రెడ్డిని ఓ ఎమ్మెల్యే దూషించడం హేయనీయమన్నారు.
ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలోని 22 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల అనుభవాలపై మూడు రోజుల సమావేశాల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కడప జిల్లాలో చిన్న, సన్నకారు రైతులకు చెందిన ఐదు లక్షల ఎకరాలను అదానికి కట్టబెట్టనుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ హక్కుల సాధనకు ఉద్యమిస్తే పోలీసులు కర్కశంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విలేకర్ల సమావేశంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్, జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ పాల్గొన్నారు.