తిరిగి పరీక్ష నిర్వహించాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-1కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోవద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. ప్రతిష్టకు పోయి నిరుద్యోగులకు నష్టం చేకూర్చొద్దని విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1కు సంబంధించి మంగళవారం రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని నందినగర్‌లోగల తన నివాసంలో కేటీఆర్… పలువురు అభ్యర్థులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహించిన విధానం, దాంట్లో జరిగిన అవకతవకలు, అభ్యర్థులకు జరిగిన నష్టం తదితరాంశాలపై ఆయన వారితో చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… రీవాల్యుయేషన్‌కు పోవద్దనీ, గతంలో తప్పు చేసిన వారి చేతికే మళ్లీ సమస్యను అప్పజెప్పొద్దని ప్రభుత్వానికి సూచించారు. తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పిన విధంగా అవకతవకలు జరిగాయనే విషయాన్ని గుర్తించాలని సర్కారుకు సూచించారు. టీఎస్‌పీఎస్సీ అవినీతి, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఉద్యోగాలను అమ్ముకుంటూ వ్యాపారం చేసిన బ్రోకర్లు, తప్పులు అధికారులు కలుగులోంచి బయటకొస్తారని ఎద్దేవా చేశారు. ఏదేమైనా హైకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ విద్యార్థులకు ప్రతీయేటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమైతే, ఈ అంశంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులనూ వెంటనే ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వానికి చెంపపెట్టు : హరీశ్‌రావు
గ్రూప్-1కు సంబంధించి హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కాంగ్రెస్ సర్కారు… ఇప్పుడు వారికేం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కండ్లు తెరవాలనీ, తప్పులు సరిదిద్దుకుని, యువతకు క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్‌కు ఆయన హితవు పలికారు.