కేంద్ర మంత్రి ‘బండి’ క్యాంపు ఆఫీస్ ముట్టడికి సీపీఐ యత్నం
పోలీసులకు, సీపీఐ శ్రేణులకు మధ్య తోపులాట
నవతెలంగాణ – కరీంనగర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం హైటెన్షన్ నెలకొంది. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజరుకుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, సీపీఐ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ యూరియా విధానం వల్ల రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రైతులు యూరియా కోసం అల్లాడుతున్నా స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజరు మౌనంగా ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్రం రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోని బీజేపీ మంత్రులను, ఎంపీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, బావండ్లపెల్లి యుగేందర్, బీర్ల పద్మ, కొట్టే అంజలి, రామారాపు వెంకటేష్ పాల్గొన్నారు.
కరీంనగర్‌లో హైటెన్షన్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES