ఇజ్రాయిల్ ఆర్ధిక మంత్రికి భారత ఆతిధ్యాన్ని ఖండించిన విజయన్
తిరువనంతపురం : భారత్‌లో ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మాట్రిచ్ పర్యటనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. స్మాట్రిచ్‌కు ఆతిధ్యం ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విజయన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఎక్స్‌లో మంగళవారం ఒక పోస్టు చేశారు. ప్రస్తుతం గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న క్రూరమైన దాడులకు, గాజాను పూర్తిగా ఆక్రమించాలనే విస్తరణవాద ఎంజెడాకు సూత్రధారి బెజలెల్ స్మాట్రిచ్ అని విమర్శించారు. గాజాలో మారణహోమం జరుగుతున్న ప్రస్తుత సమయంలో నెతన్యాహు పాలన ప్రతినిధులతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకోవడం పాలస్తీనాతో కలిగిఉన్న చారిత్రాత్మక సంఘీభావానికి ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదని విజయన్ పేర్కొన్నారు. పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాశ్వత పరిష్కారం లేకుండానే ఇజ్రాయిల్‌తో సైనిక, భద్రత, ఆర్థిక సంబంధాలను కొనసాగించడం శోచనీయమని విజయన్ విమర్శించారు.
కాగా, మూడు రోజుల పర్యటన కోసం సోమవారం భారత్‌కు తన ప్రతినిధి బృందంతో సహా బెజలెల్ స్మాట్రిచ్ చేరుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరిపిన తరువాత ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై భారత్- ఇజ్రాయిల్ సంకతం చేశాయి. ఈ ఒప్పందం తరువాత స్మాట్రిచ్ మాట్లాడుతూ ‘ఈ ఒప్పందం భారత్-ఇజ్రాయిల్ పెట్టుబడిదారులకు కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఇజ్రాయిల్ ఎగుమతులను బలోపేతం చేస్తుంది. భారత్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి కేంద్రం, ఇలాంటి దేశంతో సహకారం ఇజాయ్రిల్‌కు అద్భుతమైన అవకాశం’ అని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం ముంబయిలో స్మాట్రిచ్ సందర్మించారు. కాగా, ఈ ఏడాది నుంచి ఇంగ్లాండ్‌తో సహ అనేక పాశ్చాత్య దేశాలు స్మాట్రిచ్‌పై ప్రయాణ నిషేధం విధించినా భారత్‌లో ఆయన పర్యటంచడం ఇరు దేశాల మధ్య గణనీయమైన సహకారానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.