రజక వృత్తి దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి…
వడ్డెబోయిన వెంకటేష్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పెంపొదించుకొని రజకుల హక్కుల కోసం, వృత్తిదారుల సమస్యలపై ఉద్యమించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ వృత్తిదారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భువనగిరి మండల కేంద్రం, బస్వాపురం ,హనుమాపురం, చందుపట్ల పలు కేంద్రాల్లో సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధరైతంగా పోరాటానికి పునాదులు వేసింది చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. అగ్రకులాల స్త్రీలు, దొరసానిలు తమను కూడా దొర అని ఉత్పత్తి కులాల చేత పిలిపించుకునే సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారని అన్నారు. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు అని అన్నారు. భూమికోసం ,భుక్తి కోసం, వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం జరిగిన మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గ్రామ గ్రామాన ప్రజలను సమీకరించి పోరాట తత్వాన్ని నేర్పింది అన్నారు. ఐలమ్మ కౌలుకు తీసుకున్న 40 ఎకరాల్లో 4 ఎకరాల భూమిలో సాగును కొనసాగించి పండిన పంటను నాటి విసునూరు దేశ్ముఖు రామచంద్రారెడ్డి అక్రమంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం మాత్రం ఆపలేదన్నారు. నా ప్రాణం పోయాక ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ దొరగాడు ఇంతకంటే ఇంకా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకున్నది నీ దొరవాడు ఏం చేస్తాడు రా అని మొక్కవోని ధైర్యంతో రోకలిబండ చేతబూని గూండాలను తరిమికొట్టిందని, కాలినడకన వెళ్లి దొరకు సవాల్ విసిరిందని, ఐలమ్మ భూ పోరాటం విజయంతో ధాన్యాన్ని ప్రజలకు పంచారు అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు 4000 మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారని 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగిందన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో పాలక ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కొరకై భవిష్యత్తు ఉద్యమాలకు రజక వృత్తిదారులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బస్వాపురం అధ్యక్షులు ముదిగొండ జమ్మయ్య రజక వృత్తిదారుల సంఘం జిల్లా కోశాధికారి ముదిగొండ కృష్ణ, ఉడుత రాఘవులు, మరిపెళ్లి కిష్టయ్య, రాసాల కృష్ణ, ముదిగొండ అంజమ్మ, ముదిగొండ శేమంత, ముదిగొండ కృష్ణ, ముదిగొండ భాస్కర్, ముదిగొండ జమ్మూలు, ముదిగొండ బాలకృష్ణ, మరిపెళ్లి రాములు, ముదిగొండ మహేష్, బొజ్జ అంజయ్య, ముదిగొండ భాను లు పాల్గొన్నారు.