– ఘనంగా టీపీటీఎఫ్ ఆవిర్భావ వేడుకలు
– మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్
నవతెలంగాణ -పెద్దవంగర
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని టీపీటీఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ అన్నారు. టీపీటీఎఫ్ 12వ ఆవిర్భావ వేడుకలను మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిలర్ సోమారపు ఐలయ్య టీపీటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం మండల అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల హక్కుల సాధనలో టీపీటీఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డుల ఆన్‌లైన్ నమోదు గడువును జూన్ 30 వరకు పొడిగించాలని, ఈ.హెచ్.ఎస్ విధానాలను అందరికీ ఆమోదయోగ్యంగా రూపొందించిన తర్వాతే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తీసుకోవాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించాలని, 2026 పదవ తరగతి మూల్యాంకన భృతిని అన్ని జిల్లాలకు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వల్లాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొండ్లే రమేష్, రాజలింగం, భోగ సురేంద్ర కుమార్, చీనూరి దయాకర్, ఉడుగుల యుగేందర్, ధారావత్ దేవేందర్, చిరంజీవి, అలాగే సిఆర్పిలు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



