పారా అథ్లెట్లిక్స్‌లో డబుల్ డిలైట్
2026 గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడలు
గ్లాస్గో (స్కాట్లాండ్)
2026 గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం లభించింది. కేరళ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిశాడు. బుధవారం అర్థరాత్రి అనంతరం జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్ 8.09 మీటర్ల జంప్‌తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన మరో అథ్లెట్ లోకేశ్ సత్యనాథన్ 7.97 మీటర్ల జంప్‌తో ఐదో స్థానంలో నిలిచి పతకానికి దూరమయ్యాడు. 2022 బర్మింగ్‌హామ్‌లో తొలిసారి బరిలోకి దిగి పతకం సాధించిన మురళీ శ్రీశంకర్.. కామన్‌వెల్త్ క్రీడల్లో వరుసగా రెండో మెడల్ సాధించాడు. జమైకా అథ్లెట్, మాజీ ప్రపంచ చాంపియన్ తజల్ గేల్ 8.15 మీటర్లలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. 8.08 మీటర్ల జంప్‌తో స్కాట్లాండ్‌కు చెందిన స్టిఫెన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఫైనల్లో తొలి ప్రయత్నంలో 8.03 మీటర్ల జంప్ చేసిన మురళీ శ్రీశంకర్.. రెండో ప్రయత్నంలోనే 8.09 మీటర్ల పతక జంప్ చేశాడు. ఆ తర్వాత వరుసగా రెండు ప్రయత్నాలు ఫౌల్ కాగా.. చివరి రెండు ప్రయత్నాల్లో 7.94మీటర్లు, 7.97 మీటర్ల జంప్‌తో సరిపెట్టాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా గాయంతో దూరమైన మురళీ శ్రీశంకర్ తాజాగా గ్లాస్గోలో కామన్‌వెల్త్ క్రీడల సిల్వర్ మెడల్‌తో తనేంటో నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా, భారత పారా అథ్లెట్లు ఒకే ఈవెంట్లో రెండు పతకాలు సాధించారు. పురుషుల 100 మీటర్ల టీ47 ఫైనల్లో దిలీప్ గవిట్, మహ్మద్ బసిల్‌లు సత్తా చాటారు. 10.71 సెకండ్లలో రేసును ముగించిన దిలీప్ బంగారు పతకం సాధించగా, 10.83 సెకండ్లతో మహ్మద్ బసిల్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో జాతీయ రికార్డు బద్దలుకొట్టిన పారుల్ చౌదరి 9.26.75 టైమింగ్‌తో ఐదో స్థానానికి పరిమితమై పతకం చేజార్చుకుంది.
ఫైనల్‌కు నీరజ్ చోప్రా
2026 గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల్లో భారత సూపర్‌స్టార్, ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా పతకం దిశగా ఓ అడుగు ముందుకేశాడు. గ్లాస్గోలో గురువారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో అర్హత రౌండ్‌లో నీరజ్ చోప్రా అంచనాలను అందుకున్నాడు. నీరజ్ చోప్రాతో పాటు సహచర అథ్లెట్లు రోహిత్ యాదవ్, యశ్ వీర్ సింగ్‌లు సైతం ఫైనల్‌కు చేరుకున్నారు. ఫైనల్‌కు చేరుకునేందుకు కనీస అర్హత 84 మీటర్లు కాగా.. ప్రతికూల పరిస్థితుల్లో జరిగిన ఈవెంట్‌లో ఎవరూ ఆ మార్క్ అందుకోలేదు. దీంతో టాప్-12 అథ్లెట్లను ఫైనల్‌కు ఎంపిక చేశారు. 79.61 మీటర్ల దూరంతో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా.. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. సహచర భారత జావెలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్ 78.37 మీటర్లతో, యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్లతో వరుసగా 9, 10వ స్థానాల్లో నిలిచారు. శ్రీలంక ఆటగాడు రుమేశ్ 82.84 మీటర్లతో అగ్రస్థానంలో నిలువగా..అండర్సన్ పీటర్స్ 81.29 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) 78.63 మీటర్లతో ఏడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. శనివారం జావెలిన్ త్రో ఫైనల్ జరుగుతుంది.



