కూల్‌డ్రింక్స్..
ఇవి అందరికీ ఈజీగా అందుబాటులో ఉన్న పానీయం. పిల్లలు మొదలు.. పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తాగేస్తున్నారు. వీటి వల్ల వచ్చే అనర్థాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓ లుక్కేద్దాం.
ఫ్యాటీ లివర్
కూల్‌డ్రింక్స్‌లో ప్రాసెస్ చేసిన షుగర్ ఉంటుంది. ఈ షుగర్‌లో ముఖ్యంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే రెండు సమ్మేళనాలు ఉంటాయి. గ్లూకోజ్‌ని శరీర కణాలు ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలవు. కానీ, ఫ్రక్టోజ్‌ని మాత్రం కణాలు జీర్ణం చేసుకోలేవు. కాలేయం మాత్రమే దీన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగినప్పుడు ఫ్రక్టోజ్ ఓవర్‌లోడ్ అవుతుంది. దీంతో కాలేయం ఫ్రక్టోజ్ కణాలను కొవ్వుగా మారుస్తుంది. అయితే, ఈ కొవ్వు కాలేయంపై పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఇది ప్రమాదకర వ్యాధిగా మారొచ్చు.
బరువు పెరగడం
కూల్ డ్రింక్స్ తాగితే బరువు పెరుగుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక సాధారణ కోకా కోలా బాటిల్‌లో దాదాపు 8 టేబుల్ స్పూన్ల షుగర్ ఉంటుందట. అంటే, వీటిని తాగినప్పుడు సంతప్తిగా ఉంటుంది కానీ శరీరానికి ఎలాంటి పోషకాలను అందించవు. వీటిని ఎక్కువగా తాగితే బాడీలో షుగర్ కంటెంట్ పేరుకుపోయి కొవ్వు కణాలుగా మారుతుంది. క్రమంగా ఇది బరువు పెరిగేందుకు కారణమవుతుంది. వీటికి అలవాటు పడితే మళ్లీ మళ్లీ తాగాలని అనిపించేలా వ్యసనానికి గురిచేస్తాయి.
దంత క్షయం
సాఫ్ట్ డ్రింక్స్ మన దంతాలకు చాలా హానికరం. సోడాలలో ఉండే పాస్ఫారిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో దంతాలపై ఉండే కీలకమైన ఎనామిల్‌ని క్షీణింపజేస్తాయి. పైగా, నోటిలో బ్యాక్టీరియా వద్ధి చెంది క్యావిటీలకు కారణమవుతుంది. దీంతో దంతక్షయానికి దారితీసి పంటినొప్పి కలుగుతుంది.
డయాబెటిస్ రిస్క్
కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వ్యాధి ముప్పు పెరుగుతుంది. సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉండే ఫ్రక్టోజ్ కంటెంట్ ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతుంది. రక్తంలో పేరుకుపోయిన గ్లూకోజ్‌ను శరీర కణాలకు ఇన్సులిన్ హార్మోన్ చేరుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, గ్లూకోజ్ కణాలు ఓవర్‌లోడ్ అయినప్పుడు శరీర కణాలపై ఇన్సులిన్ ప్రభావం చూపించదు. దీంతో పాంక్రియాస్ ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నించడంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
కూల్‌డ్రింక్స్‌తో జర జాగ్రత్త..
- Advertisement -
- Advertisement -