శీతల పానీయాలతో జాగ్రత్త..

శీతల పానీయాలతో జాగ్రత్త..వేసవిలో ఎండల నుంచి ఉపశమనం కోసం చాలామంది కూల్‌డ్రింక్స్‌ (శీతల పానీయాలు) తాగు తుంటారు. తాగిన కాసేపు చల్లగా, హాయిగా వున్నా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు అనేకం. కొద్ది క్షణాల ఉపశమనం కోసం కూల్‌డ్రింక్స్‌ తాగితే నోట్లో విషం పోసుకున్నట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. మనం ఏదైనా పండ్ల రసాన్ని తయారు చేసి ఫ్రిజ్‌లో ఉంచితే రెండు, మూడు రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత పాడవుతుంది. అదే బయట ఉంచితే ఒక్క రోజులోనే పాడవ్వొచ్చు. కానీ మనకు బయట దొరికే శీతల పానీయాలు మాత్రం దాదాపుగా సంవత్సరం దాకా నిలవ వుంటాయని వాటిపై తేదీని సైతం ముద్రిస్తారు. వీటిలో ఎక్కువ రోజులు నిల్వ వుండేలా హానికరమైన రసాయనాలు వాడతారు. వీటిని తాగేయటం వల్ల మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతుంటాం.
కూల్‌డ్రింక్స్‌ వల్ల అనర్థాలివే….
కూల్‌డ్రింక్‌తో ఆస్తమా వ్యాధి, గ్యాస్‌, అసిసిటీ, కిడ్నీలో రాళ్లు, క్యాన్సర్‌, శరీరంలో చక్కెర శాతం పెరిగి షుగర్‌, ఊబకాయం వంటి వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్‌లో ఉండే క్షార లక్షణం వల్ల మన దంతాలు కూడా పాడవుతాయి. అన్ని రకాల కూల్‌డ్రింకుల్లోనూ ప్రమాదకరస్థాయిలో క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉన్నట్లుగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) గతంలో వెల్లడించింది. కాబట్టి దాహార్తి తీరటానికి మజ్జిగ, చెరకు రసం, కొబ్బరిబోండాం లాంటి వాటిని తీసుకుంటే ఉత్తమం. పండ్ల రసాలు, నిమ్మకాయ షర్బత్‌, మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరి నీరు వంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యం వందశాతం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Spread the love