Wednesday, June 3, 2026
E-PAPER
Homeమానవిగర్భిణీలు డైట్‌లో చేర్చుకోవాల్సిన పండ్లు…

గర్భిణీలు డైట్‌లో చేర్చుకోవాల్సిన పండ్లు…

- Advertisement -

గర్భధారణ సమయం అనేది మహిళ జీవితంలో అత్యంత కీలకమైన, ఆనందకరమైన దశ. ఈ సమయంలో తల్లి తీసుకునే ఆహారం నేరుగా కడుపులోని బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలు తమ డైట్‌లో తప్పక చేర్చుకోవాల్సిన పండ్లు, వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నారింజ : గర్భిణీలకు ‘ఫోలేట్’ అత్యంత అవసరం. ఇది బిడ్డ మెదడు, వెన్నుముక ఎదుగుదలకు సహాయపడుతుంది. నారింజ, బత్తాయి వంటి పండ్లలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్-సి తల్లిలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల దరిచేరకుండా చూస్తుంది.

దానిమ్మ : చాలామంది గర్భిణీలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. దానిమ్మ పండు ఈ సమస్యకు చెక్ పెడుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అంతేకాకుండా, ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడే విటమిన్-కె ని కూడా అందిస్తుంది.

అరటి పండు
: గర్భధారణ సమయంలో మలబద్ధకం ఒక సాధారణ సమస్య. అరటి పండులో ఉండే పీచు పదార్థం ఈ సమస్యను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం.. గర్భిణీలలో వచ్చే కాళ్ల వాపులు, తిమ్మిర్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం పూట ఉండే వికారాన్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
యాపిల్ : “రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు” అనే సామెత గర్భిణీలకు కూడా వర్తిస్తుంది. యాపిల్‌లో విటమిన్ ఏ, సి, పొటాషియం ఉంటాయి. గర్భధారణ సమయంలో యాపిల్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తులో ఆస్తమా, అలర్జీలు వచ్చే అవకాశం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

జామ : నారింజ కంటే ఎక్కువ విటమిన్-సి జామలో ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడానికి జామకాయ దోహదపడుతుంది. అయితే బాగా పండినవి కాకుండా, దోరగా ఉన్నవి తినడం మంచిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -