ముసురు పట్టిన వేళ ఎన్ని కూరలున్నా.. మనసు పచ్చళ్ల మీదకే పోతుంది. ఆవకాయ, గోంగూర, నిమ్మకాయ.. ఇలా ఏదైనా పచ్చడితో రెండు ముద్దలు తిన్నామంటే చాలు.. ఆహా అనిపించకమానదు. అదే నాన్ వెజ్ పచ్చడి అనుకోండి.. మరింత స్పెషల్‌గా ఉంటుంది. రుచి కూడా అదిరిపోతుంది. అందుకే తేలికైన పద్ధతిలో అద్భుతంగా కుదిరే ఈ నాన్‌వెజ్ పచ్చళ్లు ట్రై చేయండి.
చికెన్‌తో
కావాల్సిన పదార్థాలు : బోన్‌లెస్ చికెన్ – కిలో, పల్లీ నూనె – 600 మి.లీ, కారం – 150 గ్రా, సాల్ట్ – 60 గ్రా, వెల్లిగడ్డలు – రెండు, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు చెంచాల చొప్పున, నిమ్మకాయలు – రెండు, పసుపు – అర చెంచా, మెంతులు – చెంచా.
తయారు చేసే విధానం: చికెన్ శుభ్రంగా కడిగి పలుచని వస్త్రంలో మూట కట్టి నీరు కారిపోయేలా జల్లెడ గిన్నెలో ఉంచాలి. అరగంటయ్యాక పొడివస్త్రం మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఈలోపు ఆవాలు, మెంతులను మెత్తగా దంచాలి. వెల్లిగడ్డలు ముద్దగా నూరాలి. వీటిని వెడల్పాటి గిన్నెలో వేసి.. పసుపు, చెంచా ఉప్పు చికెన్‌లో కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి కొద్ది కొద్దిగా చికెన్ ముక్కలు వేస్తూ దోరగా వేయించాలి. వాటిని తీసి.. అదే నూనెలో వెల్లుల్లి ముద్ద, అది వేగగానే అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. రెండూ వేగాక మంట ఆపేసి, ఆవాలు-మెంతుల పొడి, కారం, ఉప్పు కలపాలి. నూనె చల్లారిన తర్వాత చికెన్ ముక్కలు, నిమ్మరసం వేసి కలియబెట్టాలి. అంతే ఘుమఘుమలాడే స్పైసీ చికెన్ పచ్చడి రెడీ. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. చింతపండు వేస్తే వాసన వస్తుంది, తొందరగా బూజు పడుతుంది. కనుక నిమ్మరసమే ఉపయోగించాలి.
మటన్‌తో
కావాల్సిన పదార్థాలు : మటన్ – కిలో, మెంతులు – చెంచా, ఆవాలు – రెండు చెంచాలు, నిమ్మకాయలు, వెల్లుల్లి – రెండు చొప్పున, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు చెంచాలు, పసుపు – అర చెంచా, ఉప్పు – 60 గ్రా, పల్లీ నూనె – 600 మి.లీ.
తయారు చేసే విధానం : మాంసాన్ని శుభ్రంగా కడిగి వస్త్రంలో వేసి చుట్టి.. నీరంతా పోయేలా చేయాలి. అరగంట తర్వాత పొడివస్త్రం మీదికి తీసి ఆరబెట్టాలి. ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. వెల్లుల్లి నూరి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేడిచేసి.. కొన్ని కొన్ని చొప్పున మాంసం ముక్కలు వేస్తూ దోరగా వేయించాలి. ముక్కలు సరిగా వేగకపోతే పచ్చడి నిల్వ ఉండదు. ఆ ముక్కలను మరో గిన్నెలోకి తీయాలి. సెగ తగ్గించి ముందు వెల్లుల్లి ముద్ద.. అది కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు జతచేసి వేయించాలి. దోరగా వేగాక సెగ తీసేసి.. మాంసం ముక్కలు, ఆవాలు-మెంతుల పొడి, కారం, ఉప్పు జోడించాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం కలపాలి. అంతే.. రుచికరమైన మటన్ పచ్చడి తయారైపోతుంది.
రొయ్యలతో..
కావాల్సిన పదార్థాలు : ఒలిచి శుభ్రం చేసుకున్న రొయ్యలు – కిలో, కారం – వంద గ్రా, ఉప్పు – యాభై గ్రా, పల్లీ నూనె – అర లీటర్, నిమ్మకాయలు – మూడు, ఆవాలు, అల్లం-వెల్లుల్లి పేస్టు – రెండు చెంచాల చొప్పున, మెంతులు – చెంచా, వెల్లుల్లిగడ్డలు – రెండు, పసుపు – అరచెంచా.
తయారు చేసే విధానం: రొయ్యల్లో కాస్త నిమ్మరసం, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కడిగితే.. నీచు వాసన అంతా పోతుంది. ఇలా కడిగిన రొయ్యలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేయాలి. అందులో చెంచా ఉప్పు, పసుపు జతచేసి సన్న సెగ మీదుంచి నీరంతా ఇగరనివ్వాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. కొద్ది కొద్దిగా రొయ్యలను వేయించి పక్కకు తీయాలి. ఆ నూనెలోనే వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్టు జతచేసి రెండింటినీ వేగనివ్వాలి. సెగ తీసేసి.. ఆవాలు-మెంతుల పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. నూనె చల్లారాక.. రొయ్యలు, మిగిలిన నిమ్మరసం కలపాలి. అంతే రొయ్యల పచ్చడి సిద్ధం.
గుడ్డుతో
కావాల్సిన పదార్థాలు : కోడిగుడ్లు – పదిహేను, కారం – యాభై గ్రా, ఉప్పు – ఇరవై గ్రా, నిమ్మకాయలు – రెండు, పసుపు – అరచెంచా, ఆవాలు – రెండు చెంచాలు, మెంతులు – చెంచా, పెద్ద వెల్లుల్లిగడ్డ – ఒకటి, పల్లీ నూనె – నూట యాభై మి.లీ.
తయారు చేసే విధానం : కోడిగుడ్లు ఉడకబెట్టి పెంకు ఒలిచి చాకుతో గాట్లు పెట్టాలి. అడుగు మందంగా ఉన్న కడాయిలో నూనె వేడిచేసి సన్నని సెగ మీద గుడ్లను వేయించాలి. సరిగ్గా వేగకపోతే పచ్చడి నిల్వ ఉండదు. వేగిన గుడ్లను తీసి పక్కనుంచాలి. అదే కడాయిలో వెల్లుల్లి ముద్ద వేయించాలి. సెగ తీసేసి.. కారం, ఉప్పు, ఆవాలు మెంతుల పొడి వేసి కలపాలి. నూనె పూర్తిగా చల్లారాక.. గుడ్లు, నిమ్మరసం వేసి కలియబెట్టాలి. పచ్చడిలోని గుడ్లు ఎంతో కమ్మగా ఉంటాయి. ఇది సుమారు పదిహేను రోజులు పాడవ్వకుండా ఉంటుంది.
కీమాతో
కావాల్సిన పదార్థాలు : కీమా – కిలో, ఉప్పు – ఇరవై గ్రా, కారం – వంద గ్రా, నిమ్మకాయ – ఒకటి, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు చెంచాల చొప్పున, మెంతులు – చెంచా, వెల్లుల్లిగడ్డలు – రెండు, పసుపు – అరచెంచా, పల్లీ నూనె – పావు లీటర్.
తయారు చేసే విధానం: కీమాను శుభ్రంగా కడగాలి. అందులో చెంచా ఉప్పు, పసుపు వేసి కలిపి కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత కుక్కర్ మీద మూత తీసేసి.. సన్నసెగ మీదుంచి నీరంతా ఇగరనివ్వాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. కీమాను రెండు వాయలుగా వేయించి తీసేయాలి. అదే నూనెలో వెల్లుల్లి పేస్టు, కొన్ని క్షణాల తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి వేయించాలి. రెండూ చక్కగా వేగాయనుకున్నాక సెగ తీసేసి.. ఆవాలు, మెంతుల పొడి, కారం, ఉప్పు కలపాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత కీమా, నిమ్మరసం జోడించి కలియబెడితే.. స్పైసీ, సూపర్ టేస్టీ పచ్చడి రుచి చూడొచ్చు. పెద్దవాళ్లకు మాంసం ముక్కలు అరగవనుకుంటే.. కీమా పచ్చడి బాగుంటుంది.



