Saturday, September 12, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నా అనుభవాలే నన్ను ప్రేరేపించాయి

నా అనుభవాలే నన్ను ప్రేరేపించాయి

- Advertisement -

​భవానీ బొంపెల్లి.. ఓ ఉపాధ్యాయురాలిగా పిల్లలకు పాఠాలతో పాటు సమాజాన్ని కూడా పరిచయం చేస్తున్నారు. తన పాఠశాల పిల్లలకు వినూత్న పద్ధతుల్లో, వారు ఇష్టపడేలా పాఠాలు చెబుతున్నారు. అన్ని రంగాలలో వారిని అభివృద్ధి చేస్తున్నారు. తరగతి గదిని దాటి పిల్లలను ఓ బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒకప్పుడు 40 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న ఆ పాఠశాలలో నేడు 130 మంది చేరారు. ఇదంతా ఆమె కృషి ఫలితమే. అందుకే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాలను అందుకున్న 48 మందిలో ఒకరిగా నిలిచారు. ఆమె తెలంగాణ బిడ్డ కావడం మనకు గర్వకారణం. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను మానవితో ఇలా పంచుకున్నారు.

కామారెడ్డి జిల్లాలోని, గాంధారి మా సొంత గ్రామం. అమ్మ లలిత, నాన్న రాజులు. మధ్యతరగతి కుటుంబం మాది. నాన్న చిన్న వ్యాపారం చేసేవారు. మేము ముగ్గురం ఆడపిల్లలం. నేను పెద్దకూతురిని. అయితే ఊళ్లో అందరూ ‘అయ్యో రాజుకు ముగ్గురూ ఆడపిల్లలే’ అంటూ జాలి చూపించేవారు. కానీ అమ్మానాన్న మాత్రం అలా మమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మమ్మల్ని బాగా చదివించాలని కష్టపడ్డారు. అమ్మ చదివింది ఏడో తరగతి అయినా ఇంట్లో మమ్మల్ని శ్రద్దగా చదివించేది. నేను ఏడో తరగతి వరకు ప్రైవేట్‌ ‌స్కూల్లో చదువుకున్నా. ఎనిమిది నుండి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకున్నాను. గాంధారీలో ఒకటే బిల్డింగ్‌ ఉండేది. అందులోనే ఉదయం స్కూలు, మధ్యాహ్నం నుండి ఇంటర్‌ ‌క్లాసులు జరిగేవి. అక్కడే ఇంటర్‌ ‌పూర్తి చేసి టీటీసీ రాసి ఎంపికయ్యాను. 2008లో గవర్నమెంట్‌ ‌టీచర్‌‌గా జాయిన్‌ అయ్యాను.

వినూత్న పద్ధతుల్లో బోధన
ప్రస్తుతం నేను మా సొంత ఊళ్లోని ప్రాధమిక పాఠశాలలో పని చేస్తున్నాను. ఒకప్పుడు ఊళ్లో ఒక్కటే బిల్డింగ్‌, సరైన సదుపాయాలు లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాము. అలాంటి ఇబ్బందులు ఇప్పటి పిల్లలకు ఉండకూడదని భావించాను. నా అనుభవాలే నన్ను ఇవన్నీ చేసేలా ప్రేరేపించాయి. అందుకే పిల్లలకు చదువుతో పాటు అనేక కళల్లో ప్రావీణ్యం సాంపాదించేలా ప్రయత్నిస్తున్నాను. వాళ్లకు విలువలతో కూడిన బాల్యం అందాలి అనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం. చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా ఉండాలే ఆటలు, పాటలు, నాటకాలు ద్వారా అర్థం చేయిస్తున్నాం. అంతే కాకుండా పిల్లలకు నాలుగైదు తరగతుల్లో గురుకుల, మహాత్మా జ్యోతిబాపూలే, నవోదయ వంటి స్కూల్లో చేరాలంటే పోటీ పరీక్షలు రాయాల్సి వుంటుంది. వాటికి ఎలా సిద్ధం కావాలి అనే దానిపై కూడా పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం. క్లాసులో వాటిని బోధించడంతో పాటు కొన్ని వీడియోలు చేసి చూపెడతాము. దాంతో వాళ్లు ఎంతో ఆసక్తిగా చూస్తారు, తేలిగ్గా అర్థం చేసుకుంటారు. మా స్కూల్‌ ‌పిల్లలు చాలా మంది ఈ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు.

​పిల్లలను ఆకర్షించేలా…
నేను ఈ స్కూల్లో చేరినప్పుడు కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం 130 మంది ఉన్నారు. అప్పట్లో సరైన సదుపాయాలు ఏమీ ఉండేవి కావు. స్కూల్‌ ‌డెవలప్‌‌మెంట్‌‌లో నా భర్త కూడా బాగా సహకరిస్తారు. ఆయన మొదట్లో 20 వేలు ఇస్తే వాటితో పెయింటింగ్‌ ‌వేయించాము. అది కూడా పిల్లలకు ఉపయోగపడేలా ఎకడమిక్‌‌ పద్దతిలో వేయించాము. పిల్లలు ఎంతో ఆసక్తితో పాఠశాలకు వచ్చేలా ఆ పెయింటింగ్‌ ‌చేశాము. అలాగే చంద్రశేఖర్‌ అనే ఓ దాత సహకారంతో స్కూల్‌‌కి అవసరమైన ఫర్నిచర్‌ ‌తీసుకున్నాం. అలాగే ప్రీ పైమరీ స్కూల్‌ ‌కూడా ప్రారంభించాం. చాలా మంది ఇంగ్లీష్‌ ‌మీడియం కావాలంటే పై అధికారులతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేయగలిగాము.

నవజీవన్‌ ఫౌండేషన్‌ ‌ద్వారా
మొదటి నుండి మేము పేద పిల్లలకు సాయం చేస్తుంటాము. ఒకసారి మేము స్కూల్‌ ‌ప్రచారం కోసం వెళితే ముగ్గురు అనాథ పిల్లలు అడుక్కుంటూ కనిపించారు. వాళ్ల అమ్మానాన్న చనిపోయారు. పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు. వాళ్ల తాతమ్మ దగ్గర ఉంటున్నారు. ఆమెకు చాలా పెద్ద వయసు. కళ్లు కూడా సరిగా కనిపించవు. అది తెలుసుకొని ఆమెను ఒప్పించి స్కూల్లో చేర్పించాము. వాళ్ల ఖర్చులన్నీ మేమే చూసుకుంటామని చెప్పాము. ముందు ఆమె పంపించలేనంది. చాలా నచ్చజెప్పి ఒప్పించాము. ఇప్పుడు వాళ్లకు స్కాలర్‌‌షిప్ వచ్చేలా కూడా చేశాము. జాతీయ పురస్కారం ద్వారా వచ్చిన డబ్బులో కొంత వాళ్ల పేరుతో ఫిక్స్‌‌డ్‌ ‌డిపాజిట్‌ ‌చేయాలని అనుకుంటున్నాను. మిగిలింది పేద పిల్లల చదువు కోసం ఉపయోగిస్తాను.

2025లో రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారం
నా భర్త సుధీర్‌, సాఫ్ట్‌‌వేర్‌. అయితే టీచింగ్‌ అంటే చాలా ఇష్టం. ప్రతి శనివారం స్కూల్‌‌కి వచ్చి పిల్లలకు టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ‌నేర్పింస్తుంటారు. గత ఏడాది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వచ్చినప్పుడు పదివేలు బహుమతిగా వచ్చాయి. ఆ డబ్బుకు నా భర్త మరో పది వేలు కలిపి 20 వేలతో ఓ కంప్యూటర్‌ ‌కొని స్కూల్లో పెట్టారు. దానిపై పిల్లలు ప్రతి శనివారం వాళ్లు నేర్చుకున్నది ప్రాక్టీస్‌ ‌చేస్తుంటారు. అలాగే పిల్లలకు గుడ్‌ ‌టచ్‌ – బాడ్‌ ‌టచ్‌ గురించి కూడా చెబుతున్నాను. ఎందుకంటే ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఏదైనా సంఘటన జరిగితే పిల్లలు మనకు ఫ్రీగా చెప్పుకునేలా అవగాహన కల్పిస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ విషయంలో సదుస్సులు పెడుతున్నాము.

​చదువుతో పాటు ఆటలు, పాటలు
ఈ జాతీయ అవార్డుకు అందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులకు, నాకు బోధించిన ప్రతి ఉపాధ్యాయునికి, నా కుటుంబానికి, నా భర్తకు, నా విద్యార్థులకు, గ్రామస్తులకు, నా సహోద్యోగులకు, నా ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో మా పాఠశాల పిల్లలకు మరింత మెరుగైన విద్యను అందించేందుక కృషి చేస్తాను. వారు ఇష్టపడే పద్ధతుల్లో బోధన చేస్తూ వాళ్లకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పడానికి కృషి చేస్తాను. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా పిల్లలకు చాలా అవసరం. అందుకే చదువుతో పాటు విలువలు, అన్ని రంగాలపై అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తాను. పిల్లలను ఆల్‌‌రౌండర్స్‌‌గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

– సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -