నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం హన్మకొండలోని తన నివాసంలో శుక్రవారం మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై కొండా దంపతులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. సుమంత్ అమాయకుడని చెప్పిన మాజీ మంత్రి సురేఖ అనవసరంగా అక్రమ కేసులు పెడుతున్నారని గతంలో ఆరోపించిన విషయం విదితమే. సుమంత్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సురేఖను బర్తరఫ్ చెయ్యడానికి ముందే సుమంత్ పై కేసు నమోదైంది. అయితే సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో సుమంత్ భార్య మాట్లాడుతూ వాస్తవాలనే రాయాలని మీడియాను కోరారు. పోలీసుల వేధింపుల వల్లే మా మామయ్య ఆత్మహత్యకు యత్నించారని ప్రకటన విడుదల చేశారు. సుమంత్ కోసం బంధువుల పై కూడా ఒత్తిడి పెంచారని ఈ క్రమంలోనే మామయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
కొండా రాజకీయ భవిష్యత్ పై మల్లగుల్లాలు
కొండా సురేఖ బర్తరఫ్ అనంతరం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించినా వారి వ్యవహారశైలి తెలిసిన వారెవరూ ఆ మాటలను నమ్మడం లేదు. కొండా దంపతులను చేర్చుకునే విషయంలో మిగతా రాజకీయ పార్టీలు తర్జన భర్జన పడుతున్నట్టు కనిపిస్తుంది. బర్తరఫ్ అనంతరం కొండా సురేఖ కేసీఆర్ పై పొగడ్తలు కురిపించారు. అయినా ఆ పార్టీలో చేర్చుకోవడానికి నాయకత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం. సురేఖ బర్తరఫ్ ను బీజేపీ నేతలు డి కే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించినా ఆ పార్టీ నాయకత్వం సైతం వారి చేరిక పట్ల సుముఖంగా లేదని సమాచారం. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే మౌనంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



