Saturday, September 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవిబేధాలు పరిష్కరించుకుందాం

విబేధాలు పరిష్కరించుకుందాం

- Advertisement -

జిన్‌పింగ్ ఇండియా టూర్ వేళ బీజింగ్ పిలుపు
బ్రిక్స్ సమ్మిట్ కోసం భారత్‌కు చైనా అధ్యక్షుడు
నేడు ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశం

బీజింగ్ : బ్రిక్స్ సదస్సు, ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చల కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో బీజింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, చైనాలు తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఇరు దేశాల సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని కోరింది. ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. కజాన్, టియాంజిన్‌లలో జరిగిన సమావేశాల తర్వాత ఇద్దరు నాయకులు వరుసగా మూడో ఏడాది కలుసుకోవడం ఇదేనని తెలిపారు.
“ఇరు దేశాలు తమ నాయకుల వ్యూహాత్మక మార్గదర్శకత్వం మేరకు పనిచేస్తాయి. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను దీర్ఘకాలిక దృక్పథంతో నిర్వహిస్తాయి. భారత్, చైనాలు మధ్య ఉన్న విభేదాలను సరిగ్గా పరిష్కరించుకోవాలి. ఇరు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలి. పొరుగు దేశంతో మంచి సంబంధాలను ఆస్వాదించే మిత్రుడిగా, పరస్పరం సహాయపడే భాగస్వామిగా ఉండేందుకు భారతదేశంతో కలిసి చైనా పనిచేస్తుంది.” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కోన్నారు.

బ్రిక్స్ గురించి ఏమన్నారంటే?
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం గురించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. వర్ధమాన ఆర్థిక మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలు సంఘీభావం, సహకారాన్ని నిలబెట్టుకోవడానికి బ్రిక్స్ ఇప్పుడొక కీలక వేదికగా మారిందని అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ దేశాలు దాని స్థాపన నుంచి స్వేచ్ఛ, సమ్మిళితత్వం, పరస్పర ప్రయోజన సహకార స్ఫూర్తిని నిలబెట్టుకున్నాయని అన్నారు. బ్రిక్స్ బహుళపక్షవాదం, నిష్పక్షపాతం, న్యాయం, ఉమ్మడి అభివృద్ధిని కోరుకోవడానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఇది గ్లోబల్ సౌత్‌లో అగ్రగామిగా నిలిచే ఒక నిజమైన శక్తిగా ఎదిగిందని వెల్లడించారు.

ఏడేండ్ల తర్వాత ఇండియా టూర్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చివరిసారిగా 2019లో భారత్‌లో పర్యటించారు. చెన్నై సమీపంలోని మామల్లపురంలో మోడీతో అనధికారిక సదస్సు కోసం ఇండియాకు వచ్చారు. అంతకుముందు 2016లో బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు గోవాకు వచ్చారు. అలాగే 2014 సెప్టెంబరులో భారత పర్యటన సందర్భంగా అప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రధాని మోడీతో విస్తృత చర్చలు జరిపారు. అయితే, 2020లో గల్వాన్ లోయ ఘర్షణలతో భారత్- చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏడేండ్ల తర్వాత మళ్లీ బ్రిక్స్ సదస్సు కోసం ఇండియాకు వస్తున్నారు.

ధోవల్ చైనా పర్యటన
భారత్, చైనాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు, బార్డర్ వెంబడి శాంతిని పరిరక్షించడం, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం కోసం ఇటీవలే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చైనాలో పర్యటించారు. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో బీజింగ్‌లో భేటీ అయ్యారు. పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆగస్టు 25న బీజింగ్‌లో జరిగిన 25వ విడత ప్రత్యేక ప్రతినిధుల చర్చల సందర్భంగా సరిహద్దుల వివాదం గురించి ఢోబాల్, వాంగ్ యీ ఏకాభిప్రాయానికి వచ్చారు.భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్ సమిట్
కాగా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో బ్రిక్స్ కూటమి ఏర్పాటు అయ్యింది. అనంతరం 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియాలు ఈ కూటమిలో కొత్త సభ్య దేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా బ్రిక్స్ కూటమిలో భాగమైంది. ఆ తర్వాత బెలారస్, బొలీవియా, కజకిస్థాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం బ్రిక్స్ భాగస్వామ్య దేశాలుగా చేరాయి. ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యమివ్వనుంది.

‘బ్రిక్స్ దేశాలతో పనిచేయడానికి చైనా సిద్ధం’
చైనా బ్రిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని మావో నింగ్ పేర్కొన్నారు. బ్రిక్స్ సహకారంలో చురుకుగా పాల్గొంటుందని స్పష్టం చేశారు. ఇరాన్-అమెరికా సంఘర్షణ, ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో ఇండియాలో బ్రిక్స్ సమావేశం జరగడాన్ని మావో నింగ్ ప్రస్తావించారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించు కోవడానికి, శాంతి, స్థిరత్వానికి దోహదపడటానికి బ్రిక్స్ దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -