నాన్-డెయిరీ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం
టీజీసేఫ్ కీలక నిర్ణయం
హైదరాబాద్ : ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలోఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలామణి అవుతున్న నకిలీ, కృత్రిమ పనీర్‌పై తెలంగాణ సేఫ్టీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉక్కుపాదం మోపింది. తెలంగాణ వ్యాప్తంగా నాన్-డెయిరీ, అనలాగ్, ఆర్టిఫిషియల్ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పనీర్ పేరుతో అనలాగ్ లేదా నాన్-డెయిరీ పదార్థాలను తయారు చేయడం, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ చేయడం, పంపిణీ, రవాణా, విక్రయించడంపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన నిషేధం అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. పాలతో కాకుండా రసాయనాలు,వెజిటబుల్ ఆయిల్స్, ఇతర కృత్రిమ పదార్థాలతో చేసే అనలాగ్ పనీర్ ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు సృష్టం చేశారు. ఈ నిషేధాజ్ఞలు 2026 సెప్టెంబర్ 10 నుంచి తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని టీజీ సేఫ్ ప్రకటించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 లోని సెక్షన్ 30(2)(ఏ) కింద ఆధారాలు లభించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి నకిలీ, అనలాగ్ పనీర్‌ను విక్రయించినా, నిల్వ చేసినా ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తప్పవని టీజీ సేఫ్ అధికారులు హెచ్చరించారు.
ప్రజారోగ్యంతో చెలగాటం
హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని డెయిరీల్లో అనలాగ్ పనీర్ను తయారు చేస్తున్నారు. దీన్ని నగరంలో పలు రెస్టారెంట్లు, హోటళ్లు, స్ట్రీట్ సైడ్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న టీజీసేఫ్ ఇటీవల నగరంలో 14 పనీరు, డెయిరీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అపరిశుభ్ర పరిసరాల్లో పనీర్ తయారీ
టీజీ-సేఫ్ తనిఖీల్లో ఇటీవల రూ.7.19 లక్షల విలువైన టన్ను లూజ్ పామాయిల్, 476 కేజీల గ్లిజరాల్ మోనోస్టియరేట్ (కృత్రిమ పనీర్ తయారీకి వాడేటువంటి రసాయనం), 150 కేజీల పాలపొడి (నాణ్యత లేనిది)ని సీజ్ చేశారు. జీడిమెట్లలోని యశోద డెయిరీ, రామ్‌దేవ్ డెయిరీ, గగన్‌పహాడ్‌లోని లక్ష్మీఫుడ్స్తోపాటు మైలార్‌దేవ్‌పల్లిలో ధనలక్ష్మి డెయిరీ, ఇబ్రహీంపట్నంలోని మానస డెయిరీ, ఖానాపూర్ శ్రీ మహాలక్ష్మి డెయిరీ, నాదర్‌గుల్ గీతా డెయిరీ, హయత్‌నగర్‌లోని అనిత డెయిరీ, నార్ముల్ డెయిరీ, బహదూర్‌పుర శక్తి ట్రేడర్స్, హుస్సేని ఆలం కరాముంగి ట్రేడర్స్, ఇబ్రహీంపట్నంలోని తిరుమల డెయిరీ, ముచ్చింతల్‌లోని వి.కె.డెయిరీ, అల్వాల్‌లోని నటరాజ్ మిల్క్ ప్రొడక్ట్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. తయారీ కేంద్రాల వద్ద ఈగలు, బొద్దింకలు స్వైర విహారంతోపాటు మురుగునీరు నిలిచిపోయి పరిసరాలు దారుణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నోటీసులు ఇచ్చి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. కృత్రిమ పనీర్ (అనలాగ్)తో ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.



