Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలి

‌జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలి

- Advertisement -

10వ కాలమ్‌‌లో చేర్చాలని కేంద్రానికి డిమాండ్‌
రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి 
అసెంబ్లీ ఆమోదం
బీజేపీ అనుకూలమా?, 
వ్యతిరేకమా? : భట్టి
బీసీల వ్యతిరేకి బీజేపీ : పొన్నం
సమాధానం చెప్పకుండా బీజేపీ సభ్యుల వాకౌట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చేఏడాది జరిగే జనగణనలో ఓబీసీ కులగణన ప్రకియను శాస్ర్తీయంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌‌ చేసింది. కేంద్ర జన గణన షెడ్యూల్‌లోని ‌పదో కాలమ్‌లో ఎస్సీ,ఎస్టీలతోపాటు బీసీ/ఓబీసీ విభాగాన్ని చేర్చాలని కోరింది. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు కూడా ముందస్తుగా కులాల జాబితా, ప్రత్యేక కోడ్‌‌లు ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌ప్రవేశపెట్టిన జనగణన-2027 రెండో దశ ప్రశ్నావళిలో బీసీ/ఓబీసీ కులగణనను చేపట్టాలన్న తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించినట్టు స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ జనగణనలో బీసీ/ఓబీసీ కులగణన చేపట్టాలన్న తీర్మానాన్ని బీజేపీ సభ్యులు ఆమోదిస్తున్నారా?వ్యతిరేకిస్తున్నారా?అని ప్రశ్నించారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. మంత్రి శ్రీధర్‌‌బాబు మాట్లాడుతూ ఓబీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా? లేదా?అన్నది స్పష్టం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బీజేపీ సభ్యులు పాయల్‌ ‌శంకర్‌ ‌తీర్మానంపై సమాధానాన్ని దాటవేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌‌ను అమలు చేయనందుకు నిరసనగా వాకౌట్‌ ‌చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తీర్మానానికి మద్దతు ఇవ్వకుండానే బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ బీజేపీ మనువాద పార్టీ అనీ, అది బీసీల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా బీసీలను బీజేపీ అవమానించిందని చెప్పారు. కులగణనలో తెలంగాణ, బీహార్ నమూనాగా ఉన్నాయని వివరించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించే విధంగా ప్రశ్నావళిని రూపొందించాలని కోరారు. అవసరమైతే ప్రస్తుత ప్రశ్నావళిని రద్దు చేసి, నిపుణులతో సంప్రదించి కొత్త శాస్త్రీయ ప్రశ్నావళిని రూపొందించాలని సూచించారు. ప్రధాని మోడీ బీసీ అని చెప్పుకోవడమే కాదనీ, వారికి న్యాయం చేయాలని కోరారు. బీసీ జనాభాను లెక్కించకుండా వారికి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బీసీ సంఘాలు, సామాజిక నిపుణులు, గణాంక నిపుణులతో చర్చించాలని డిమాండ్‌ ‌చేశారు. బీసీలను కచ్చితంగా లెక్కించే వరకు జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కులగణన కేవలం సంఖ్యల లెక్కింపు కాదనీ, ఇది సామాజిక న్యాయానికి పునాది అని వివరించారు. కులగణన కులాలను సృష్టించడానికి కాదనీ, అసమానతలను గుర్తించడానికని చెప్పారు.
అందరి లక్ష్యం కులరహిత సమాజ నిర్మాణమేనని స్పష్టం చేశారు. పాత గణాంకాలతో కొత్త భారతదేశానికి సామాజిక న్యాయం చేయలేమని అన్నారు. కొత్త గణాంకాలు కావాలని సూచించారు. ఈడబ్ల్యూఎస్‌ ‌రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి లేదని గుర్తు చేశారు. బీసీలకూ విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

బీజేపీ వైఖరికి మంత్రి సీతక్క ఖండన
తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా వాకౌట్‌ ‌చేసిన బీజేపీ వైఖరిని ఖండిస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. వారి దురుద్దేశం బయటపడిందన్నారు. బీసీ ప్రధాని అంటున్నా ఆ సామాజిక తరగతులకు న్యాయం చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ ‌సభ్యులు కె శంకరయ్య, నవీన్‌ ‌యాదవ్‌ ‌మాట్లాడుతూ ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించారు.
బీసీలు తిరగబడతారు : బీర్ల ఐలయ్య
బీసీలను అణగదొక్కే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని విప్‌ ‌బీర్ల ఐలయ్య విమర్శించారు. రాష్ట్రం నుంచి ఎనిమిది ఎంపీలు, ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినా ఓబీసీల కులగణనను చేపట్టాలనే తీర్మానాన్ని ఆమోదించకపోవడం విచారకరమని అన్నారు. బీజేపీ నాయకులు ఊర్లకు వస్తే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు. బీసీల ద్రోహుల పార్టీగా బీజేపీ ఉండొద్దని కోరారు. ఈ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.
బీజేపీ నిజస్వరూపం బయటపడింది : కూనంనేని
జనగణనలో బీసీ/ఓబీసీ కులగణనను చేపట్టాలనే తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవడంతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందిన సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎస్సీ,ఎస్టీలతోపాటు ఓబీసీ కాలమ్‌ ‌కూడా పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. అప్పుడే ఏ కులం జనాభా ఎంతో తెలుస్తుందన్నారు. ఓబీసీ కులగణనను కేంద్రం తొక్కితే ప్రజలు కేంద్రాన్ని తొక్కుతారని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -