సంయుక్త కిసాన్ మోర్చా, కౌలు రైతుల గుర్తింపు
సాధన కమిటీ డిమాండ్
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో
మీడియా సమావేశం
నవతెలంగాణ-హిమాయత్ నగర్
తెలంగాణలో కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ప్రారంభించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వారికి సాగుదారు కార్డులు జారీ చేయడంతోపాటు, వారు తమ పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు విక్రయించుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరాయి. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ.. కౌలు రైతుల గుర్తింపు కోసం 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పశ్య పద్మ మాట్లాడుతూ.. కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను సెప్టెంబర్ నెల నుంచే ప్రారంభించాలని కోరారు. తక్కువ వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు సాగుదారులు తమ పంటలను ఎంఎస్‌పీకి విక్రయించుకోలేకపోతే మరిన్ని ఇబ్బందులు పడతారని తెలిపారు. ప్రభుత్వం జాప్యం చేస్తే కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్‌లో ఆందోళనలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.
రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షులు బి.కొండల్ మాట్లాడుతూ.. కౌలు సాగుదారుల గుర్తింపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ ఈ అంశాన్ని త్వరితగతిన, సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. ఏఐకేఎంఎస్ నాయకులు ఏనుగు చంద్రారెడ్డి, భాస్కర్ మాట్లాడుతూ.. 2011 చట్టం ప్రకారం కౌలు సాగుదారుల వద్ద దరఖాస్తులు తీసుకొని గ్రామస్థాయిలో ప్రజా విచారణ నిర్వహించి గుర్తించే ప్రక్రియ స్పష్టంగా ఉందని తెలిపారు. తెలంగాణ రైతాంగ సమితి అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, సాధన కమిటీ నాయకులు, విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షులు కన్నెగంటి రవి, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు పి.శంకర్, రౌతు రమేష్ మాట్లాడారు. కౌలు రైతులను సేకరణ సంస్థల వద్ద నమోదు చేసేందుకు అమలు చేస్తున్న ఓటీపీ ఆధారిత విధానం పరిమితమైందని, తమ పేరుతో పంటను విక్రయించుకోగలిగిన కౌలు రైతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో కౌలు సాగుదారుల గుర్తింపు కోసం అనుసరించాల్సిన ప్రక్రియకు సంబంధించిన సమగ్ర నోట్‌ను విడుదల చేశారు. ఈ ప్రక్రియపై రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు అంగీకరించినట్టు నాయకులు తెలిపారు. కౌలు రైతుల గుర్తింపు అంశంపై ఈనెల 2న నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో 9 రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని, కౌలు సాగుదారుల గుర్తింపుకు, 2011 చట్టం అమలుకు మద్దతుగా సంయుక్త ప్రకటన విడుదల చేశారని సాధన కమిటీ తెలిపింది. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, టీజేఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, తెలంగాణ రక్షణ సేన, ధర్మ సమాజ్ పార్టీ, తదితర పార్టీల ప్రతినిధులు ఈ ప్రకటనను విడుదల చేశారని పేర్కొంది.
కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



