Sunday, September 13, 2026
E-PAPER
Homeక్రైమ్పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

- Advertisement -

అడ్డుగా వచ్చిన కారును తప్పించబోయి అదుపు తప్పిన బస్సు
పలు వాహనాలు ధ్వంసం
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్‌

​కారును తప్పించబోయిన ఆర్టీసీ అద్దె బస్సు అదుపుతప్పి పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. పలు వాహనాలను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టమూ జరగకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాటసింగారం గ్రామపంచాయతీ పరిధిలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో గురువారం ఉదయం 10.45 గంటల సమయంలో డీజిల్‌ కోసం ఓ కారు, ఆటోతో పాటు పలు వాహనాలు వరుసలో నిలిచాయి. అదే సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి చౌటుప్పల్‌ వైపు వెళ్తోంది. పెట్రోల్‌ బంక్‌ సమీపానికి రాగానే ఓ కారు అడ్డుగా రావడంతో దానిని తప్పించబోయిన డ్రైవర్‌ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో బస్సు నేరుగా పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లి డీజిల్‌ కోసం వేచి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్విఫ్ట్‌ కారు, ట్రాలీ ఆటోతో పాటు ఆయిల్‌ డిస్‌ప్లే, పెట్రోల్‌ గన్‌, పిల్లర్‌, విద్యుత్‌ తీగలు ధ్వంసమయ్యాయి. బస్సు దూసుకొస్తున్న విషయాన్ని గమనించిన పలువురు అక్కడి నుంచి పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -