22ఏపై బాధితులకు ఎలాంటి రిలీఫ్ రాలేదు
పొంగులేటిది అబద్ధాల ప్రవాహం
తప్పు చేసింది మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వమే :హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్ అసెంబ్లీలో ఉంటే వారి అవినీతి బట్టబయలవుతుందని ఉద్దేశ్యపూర్వకంగా బయటకు పంపారని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ టి హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన అంశం 22 ఏ నిషేధిత భూముల విషయంపై అసెంబ్లీ సాక్షిగా స్పష్టత వస్తుందనుకున్నామన్నారు. కానీ.. ఆశించిన బాధితులకు ఎలాంటి రిలీఫ్ రాలేదని తెలిపారు. మంత్రి పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారని విమర్శించారు. ‘మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగారు, క్షమాపణ చెప్పాలి, మైకు ఇవ్వండి మాడ్లాడడానికి’అంటే మమ్మల్ని సస్పెండ్ చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. సమస్యల మీద స్పందిస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్నట్టు చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పొంగులేటి తప్పు జరిగిందని మొత్తానికి ఒప్పుకున్నరన్నారు. ప్రజలను బాధ పెట్టినందుకు, క్షమాపణ చెబుతావని ఆశించామన్నారు. తప్పు చేసింది నువ్వు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. నో ఎల్ ఆర్ ఎస్ నో బీఆర్ఎస్ అన్నవు కదా..ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి రాగానే ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూ పేదల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. అసైన్ భూములు పట్టా భూములు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయని ఒప్పుకోని అందులో కూడా అర్ధ సత్యం చెప్పిండన్నారు. 9,200 డాక్యుమెంట్ల జరిగినట్లుగా సమాచారం ఉందని చెప్పారు.
ఇవి భూ భారతిలో ఉన్న లొసుగులు కాదా? అని ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు అంటూ సీనియర్ శాసనసభ్యులకు మర్యాద లేకుండా మాట్లాడటం తగదని చెప్పారు. ‘నీకు, నీ ముఖ్యమంత్రికి ఉద్యమం తెలవదు, పోరాటం తెలవదు’ అని ఎద్దేవా చేశారు. నిషేధిత భూముల జాబితాను ఎప్పటి లోగా తొలగిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజుగారి దేవతావస్త్రాల్ల వలే మీ అవినీతి నగ్నంగా ఊరేగుతున్నదని విమర్శించారు. 30శాతం కమిషన్ల ప్రభుత్వం అని రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నదని చెప్పారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొంగులేటి చాలా అహంకారం తో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారని హెచ్చరించారు. జనగామ శాసనసభ్యుడు వట్టినాగుపల్లిలో 3వేల కోట్ల భూమి బూదాన్ భూమి తీసుకున్నా అని చెప్పటం హస్యాస్పదమన్నారు. దాని వివరాలను ఆధారాలతో వివరించారు. నీకు నీతి నిజాయితీ, చీము నెత్తురు ఉంటే, 29 ఎకరాల భూమి తనది అని రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఆ విషయాన్ని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేదంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.



