లిక్కర్ గోదాముల్లో కార్మికుల శ్రమ దోపిడీ
కాటన్ డ్యామేజ్ నష్టాన్ని కార్మికుల నుంచి వసూలు
స్కానర్లకు ఇవ్వకుండా డబ్బులు తీసుకుంటున్న డీఎం
సేఫ్టీ పరికరాల్లేక అభద్రతా వలయంలో గోదాం కార్మికులు
పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యూటీ అమలు చేయాలి
నవతెలంగాణ- మహబూబ్ నగర్
ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.40 వేల కోట్లు ఆదాయాన్ని సమకూర్చుతున్న బేవరేజ్ కార్పొరేషన్ గోదాముల్లో పని చేస్తున్న కార్మికుల పొట్టలు కొడుతున్నారు. వైన్ షాపులకు మద్యం తరలించడం కోసం బార్ కోడ్లను స్కాన్ చేయడానికి స్కానర్ లు ఉంటారు. వీరు పనిచేసినందుకు షాపుల నుంచి వసూలు చేసే ఎమౌంట్‌ను అధికారులు కాజేస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. పైగా గోదాములో కాటన్ లు ఎత్తుతున్న సమయంలో బీరు, లిక్కర్ సీసాలు పగిలితే ఆ నష్టాన్ని కార్మికుల నుంచే వసూలు చేస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాడ్యుటి వంటి కనీస సదుపాయాలకు నోచుకోవట్లేదు. అభద్రతలో గోదాం కార్మికులు జీవనం సాగిస్తున్నారు. బేవరేజ్ కార్పొరేషన్ గోదాంలలో పనిచేస్తున్న కార్మికులు (స్కానర్ల) పరిస్థితి దయనీయంగా మారింది. గోదాములలో కార్మికులకు కనీస చట్టాలు అమలు కావడం లేదు. చేసిన కష్టాన్ని డిఎంలు దోచుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 19 బేవరేజ్ కార్పొరేషన్ డిపోలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 1700 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. కార్మిక నిబంధన ప్రకారం వీరికి ఎలాంటి చట్టాలు వర్తించడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట, వనపర్తి జిల్లా కొత్తకోటలో రెండు డిపోలు ఉన్నాయి. వీటిల్లో పనిచేస్తున్న కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
స్థానిక రాజకీయాల వల్ల నిత్యం ఏదో ఒక రకమైన గొడవతో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కొత్తవారిని చేర్చుకోవాలని ఒత్తడి పెంచుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుల ప్రమేయం అధికంగా ఉంటోంది. తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఎంఎఫ్ఎల్ డిపోలో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. డిపో నుంచి వివిధ షాపులకు లిక్కర్, బీర్ కాటన్ లు సరఫరా అవుతాయి. డిపో నుంచి కాటన్ లు బయటికి వెళ్లే ముందు గోదాంలో బార్కోడ్ ను స్కాన్ చేయాలి. ఒక షాప్ కు తరలించే మద్యానికి స్కాన్ చేస్తే 100 రూపాయలు షాపు యజమాని నుంచి వసూలు చేస్తారు. ఇలా ప్రతిరోజు 70 కి పైగా షాపులకు స్కానర్ లు స్కాన్ చేస్తారు. నెలకు 25 రోజులు గోదాంలో పని చేస్తే రూ 1,75,000లు స్కానర్లకు షాప్ యజమానులు చెల్లిస్తారు. అలా వచ్చిన డబ్బులు డిపో మేనేజర్ తన ఖాతాలో వేసుకొని నెల రోజుల తర్వాత ఒక్కో కార్మికునికి రూ.20వేల చొప్పున 5 మందికి ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హక్కులను హరిస్తున్న కార్పొరేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బేవరేజ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గోదాములలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టాలు అమలు కావడంలేదు. ముఖ్యంగా ఈఎస్ఐ పీఎఫ్, గ్రాడ్యుటి, బీమా వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. రెండేండ్లకోసారి వేతనం పెంచాల్సిన కార్పొరేషన్ అధికారులు ఐదుపది పైసలు మాత్రమే పెంచుతున్నారు. గోదాంలో పనిచేస్తూ ఎవరైనా కార్మికులు అనారోగ్యానికి గురైతే ఏమాత్రం పట్టించుకోవడంలేదు.
వృత్తిలో ప్రమాదాలకు గురై అనేకమంది వికలాంగులైన సందర్భాలు ఉన్నాయి. కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డు, డ్రెస్ కోడ్, బోనస్, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ తదితర సదుపాయాలు అమలు చేయాల్సిన కార్పొరేషన్ అధికారులు ఏవీ పట్టించుకోవడంలేదు. సీసాలు పగిలితే కార్మికులనే బాధ్యత లారీలో వచ్చిన కాటన్లలో బీరు సీసాలు, లిక్కర్ బాటిల్స్ ఉంటాయి . ఎగుమతి, దిగుమతి చేసే సమయంలో గ్యాస్ తో కూడిన బీరు, లిక్కర్ బాటిల్లు ఒక్కోసారి పగులుతాయి. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల కూడా ఒక్కొసారి సీసాలు పగులి భారీ శబ్దం వస్తుంది. అలా పగిలిన సీసాలను డ్యామేజి కింద కార్పొరేషన్ భరిస్తుంది. కానీ.? అధికారులు ఆ నష్టాన్ని కార్మికుల నుండే వసూ లు చేస్తున్నారు. కార్మికుల నెల వేతనం నుంచి నష్టాన్ని తీసుకుని మిగతాది జీతంగా ఇస్తుం డడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. మా కష్టాన్ని దోచుకుంటున్నారురవి, శ్రీకాంత్, మాధవులు, బాలకృష్ణ శివ-తిమ్మాజీపేట డిపోమా శ్రమను దోచుకుంటున్నారు. ఆరోగ్యం చెడిపోయినా కంపెనీలో పని చేస్తున్నాం. బీరు బాటిళ్లు బాంబుల్లా పేలి మా శరీరంలో గుచ్చుకుంటున్నాయి. గాయాల పాలైతే మాకు ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదు. ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాడ్యుటి సదుపాయాల్లేవు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు కార్డులు, రక్షణ పరికరాలు ఇచ్చి ఆదుకోవాలి.
డ్యామేజ్ ను కార్మికుల నుంచి వసూలు చేయొద్దు
బీరు బాటిల్లు, మద్యం సీసాలు పగిలితే కార్మికుల నుంచి నష్టపరిహారాన్ని రాబడుతున్నారు. ఇది న్యాయం కాదు. ముఖ్యంగా ఎనిమిది గంటలకు మించి పని చేయిస్తున్నారు. కార్మికులకు భద్రత కరువైంది. సేఫ్టీ పరికరాలు ఇవ్వట్లేదు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-బాలరాజు- బేవరేజ్ కార్పొరేషన్ సంక్షేమ
సంఘం రాష్ట్ర అధ్యక్షులు
మేము ఏమి మార్చలేదు
గత మూడేండ్లుగా స్కానర్లకు సంబంధించిన వేతనాల విషయంలో మేము కొత్తగా మార్చింది ఏమీ లేదు. ఆఫీస్ ఖర్చులు, భోజనాలు, పరిపాలనకు సంబంధించిన అవసరాల కోసమే కొంత అమౌంట్ తగ్గించి కార్మికులకు ఇస్తున్నాము. నేను ఇటీవలే బాధ్యతలు స్వీకరించాను. కార్మికులకు అన్యాయం చేయం.
-మల్లికార్జున రావు డిఎం, తిమ్మాజిపేట గోదాం, నాగర్ కర్నూల్ జిల్లా



