Sunday, September 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅన్నదాతల ఆక్రందన

అన్నదాతల ఆక్రందన

- Advertisement -

సాగునీరు, విద్యుత్‌ కోతలపై రైతుల ఆందోళనలు
సబ్‌ ‌స్టేషన్ల వద్ద ధర్నాలు
12గంటలు కూడా సరఫరా కావడం లేదని ఆవేదన

నవతెలంగాణ- ఇల్లంతకుంట /వేంసూరు/వనపర్తి రూరల్‌ /తిమ్మాజిపేట/సూర్యాపేట
​పంటలకు సాగునీరు అందించాలని, విద్యుత్‌ ‌కోతలను నివారించాలంటూ రైతులు శనివారం పలు జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. సబ్‌ ‌స్టేషన్ల వద్ద ధర్నాలు చేపట్టారు. మధ్య మానేరు ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల- కరీంనగర్ రహదారిపై రైతులు రాస్తారోకో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మధ్య మానేరు ప్రాజెక్టు కుడి కాలువ పక్కనే ఉన్న పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోసం పెట్టిన పెట్టుబడి, తమ కష్టం మొత్తం వృథా అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య మానేరు కుడికాలువ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆందోళన విషయం తెలిసిన వెంటనే ఇల్లంతకుంట ఎస్‌ఐ ఉపేంద్ర చారి ఘటన స్థలానికి వచ్చి ఇరిగేషన్ డీఈ వెగ్గలం సూర్య ప్రకాష్ తో రైతులను మాట్లాడించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో వంతడుపుల, వల్లంపట్ల, రంగపేట గ్రామాల రైతులు పాల్గొన్నారు.

విద్యుత్‌ కోతలపై నిరసన
విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందంటూ రైతులు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులకు సంఘీభావం తెలిపారు. కందుకూరు వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి సబ్‌స్టేషన్‌ వరకు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేపట్టి విద్యుత్‌ శాఖ ఏడీని నిలదీశారు. సబ్‌స్టేషన్‌లోని లాక్ బుక్‌ను తెరిచి రైతులకు ఎన్ని గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారో వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. అప్రకటిత విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని వనపర్తి మండలం నాచహల్లి క్రిష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాల రైతులు సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. వనపర్తి పెబ్బేరు ప్రధాన రహదారిపై బైటాయించారు. విద్యుత్‌ శాఖ ఏఈ చంద్రశేఖర్‌ అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. డీఈతో మాట్లాడించాలని రైతులు పట్టుబట్టారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరాళ్లపల్లి రైతులు సబ్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు.

విద్యుత్‌ ఏఈ ఫోన్‌ ద్వారా రైతులతో మాట్లాడి 3 ఫేజ్‌ విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయమూ కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం సబ్‌స్టేషన్‌ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైటాయించడంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యుత్‌ అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకో విరమించారు. సూర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద కాసరబాద, తాళ్లఖమ్మంపహాడ్‌, కేసారం తదితర గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మోతె మండలం రాయిపహాడ్‌లో రైతులు ధర్నా నిర్వహించారు. పెన్‌పహాడ్‌ మండలంలోనూ రైతులు సబ్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. కరెంటు కోతలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు, కొండపాక సబ్‌ ‌స్టేషన్ల వద్ద రైతులు ఆందోళన చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -