ఎలాంటి దాడినైనా తట్టుకునే భద్రతా వ్యవస్థ
అత్యాధునిక కమ్యూనికేషన్ సౌకర్యాలు
జిన్‌పింగ్, పుతిన్ వాహనాల ప్రత్యేకతలు ఇవే
న్యూఢిల్లీ : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్న చైనా, రష్యా అధ్యక్షఁలు జిన్‌పింగ్, పుతిన్ తమ ప్రతినిధి బృందాలతో పాటు అత్యాధునిక రక్షణ కవచాలతో కూడిన లిమోసిన్ వాహనాలను కూడా వెంట తీసుకొని వచ్చారు. శుక్రవారమే న్యూఢిల్లీ చేరుకున్న పుతిన్ రష్యాలో తయారైన అరస్ సెనాట్‌లో ప్రయాణించారు. శఁవారం భారత్‌కు చేరుకున్న జిన్‌పింగ్ తమ దేశంలో తయారైన హాంగ్‌కీ 701 వాహనాన్ని ఉపయోగించారు. ఈ రెండూ లిమోసిన్ వాహనాలే. సాధారణ కార్లతో పోలిస్తే వాటిలో భద్రతా ప్రమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అధ్యక్షులకే పరిమితం
రష్యా అధ్యక్షభవనం గతంలో ఉపయోగించిన మెర్సిడెస్-బెంజ్ ఎస్ 600 గార్డ్ పుల్‌మన్ స్థానంలో 2018లో పుతిన్ అరస్ సెనాట్‌కు మారారు. కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. దీని పొడవు సుమారు ఏడు మీటర్లు. అనేక టన్నుల బరువు ఉంటుంది. రక్షణ కవచం, భద్రతా పరికరాలే దీనికి కారణం. ప్రయాణ సమయంలో పుతిన్ అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాధారణ పౌరులు ఉపయోగించే సెనాట్ కారు ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలు. పుతిన్ ఉపయోగిస్తున్నది కేవలం అధ్యక్షుడి కోసం ఉద్దేశించింది. ఇందులో అదనపు భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. ఇది వాణిజ్యపరంగా అందుబాటులో లేదు. గత ఏడాది చైనాలో జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ వాహనంలోనే పుతిన్‌తో కలిసి ప్రయాణించారు. ఇక జిన్‌పింగ్ ఉపయోగిస్తున్న హాంగ్‌కీ బ్రాండ్ కారును 1958లో తొలిసారిగా ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ తయారు చేసింది. చైనా రాజకీయ నాయకత్వం కోసం వాహనాల తయారీకి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
దీని తొలి మోడల్స్‌ను కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, పర్యటనలకు వచ్చే విదేశీ నేతలు ఉపయోగించే వారు. అయితే చైనాలో విలాసవంతమైన విదేశీ కార్ల తయారీదారులు విస్తరించడంతో దీని ప్రాముఖ్యత తగ్గిపోయింది. కానీ ఆ తర్వాతి కాలంలో ఓ ప్రీమియం బ్రాండ్‌గా దీన్ని పునరుద్ధరించారు. జిన్‌పింగ్ ఉపయోగిస్తున్న ఎన్701 కారు 18 అడుగుల కంటే ఎక్కువ పొడవు, మూడు టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుందని అంచనా. ఈ తరహా వాహనాలను చాలా పరిమిత సంఖ్యలో తయారు చేస్తారు. ఇది ప్రైవేటు కొనుగోలుదారులకఁ అందుబాటులో లేదు. గత సంవత్సరం ఎస్‌సీఓ సదస్సు కోసం తియాంజిన్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ హాంగ్‌కీ ఎల్5లో ప్రయాణించారు.
ప్రత్యేకతలెన్నో
లిమోసిన్ తరగతికి చెందిన కారు అద్దాలు చాలా మందంగా ఉండి తుపాకీ బులెట్లను కూడా తట్టుకోగలవు. కారు బాడీని మిలిటరీ గ్రేడ్ లేదా స్టీల్ లేదా టైటానియంతో తయారు చేస్తారు. ఇది బాంబు పేలుళ్లు, గ్రనేడ్ దాడుల నుంచి లోపల ఉన్న వారిని కాపాడుతుంది. టైరు పంక్చర్ అయినా లేక తుపాకీ కాల్పుల కారణంగా దెబ్బతిన్నా కారు ఆగకుండా అధిక వేగంతో సురక్షిత ప్రాంతానికి వెళుతుంది. కారు ఇంధన ట్యాంకుకు ప్రత్యేక రక్షణ కవచం ఉంటుంది. ప్రమాదం జరిగినా లేక దాడి జరిగినా పేలిపోకుండా దాన్ని రూపొందించారు. రసాయన లేదా గ్యాస్ దాడులు జరిగినప్పుడు బయటి గాలి లోపలికి రాకుండా కారు లోపల ఉన్న ఆక్సిజన్ వ్యవస్థ మాత్రమే పనిచేసేలా లాక్ చేయవచ్చు. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా అత్యవసర సమాచారం పంపడానికి శాటిలైట్ ఫోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంటాయి. కారును నడిపే డ్రైవర్ రక్షణ, భద్రతకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొంది ఉంటాడు. ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కారును సురక్షితంగా ఎలా బయటపడేయాలో అతనికి తెలిసి ఉంటుంది.
రక్షణ కవచం అభేద్యం!
- Advertisement -
- Advertisement -



