Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయంవేధించే సాధనంగా గూండా చట్టం!

వేధించే సాధనంగా గూండా చట్టం!

- Advertisement -

యూపీ ప్రభుత్వ తీరుపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం
అలహాబాద్‌
: ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం గూండా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని అలహాబాద్‌ ‌హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠినమైన ఈ చట్టాన్ని ప్రజలను వేధించే ఒక సాధనంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లు తమ వద్దకు వచ్చిన కేసులను చూస్తుంటే అర్దమవుతోందని పేర్కొంది. గూండా చట్టమనేది అత్యంత శక్తివంతమైన చట్టమని, దీన్ని అత్యంత జాగ్రత్తగా ప్రయోగించాల్సి వుంటుందని, స్పష్టమైన కేసుల్లో, శాంతి భద్రతలను పరిరక్షించేందుకే ఉపయోగించాలని జస్టిస్‌ ‌సుభాష్‌ ‌విద్యార్ధి నేతృత్వంలోని లక్నోబెంచ్‌ ‌వ్యాఖ్యానించింది. జహీద్‌ అలీ అనే వ్యక్తిని గూండాగా పేర్కొంటూ, ఆరు మాసాల పాటు ఆయనను జిల్లా నుండి బహిష్కరిస్తూ గోండా జిల్లా మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్వర్వులను కొట్టివేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. జిల్లా మేజిస్ట్రేట్‌ ‌తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ డివిజనల్‌ ‌కమిషనర్‌ ‌జారీ చేసిన అప్పిలేట్‌ ఆర్డర్‌‌ను కూడా కోర్టు కొట్టివేసింది. 2010 నాటి కేసులో జాహిద్ అలీని నిర్దోషిగా విడుదల చేశారని, తదనంతరం అతన్ని ‘గూండా’గా ప్రకటించడానికి ఆ కేసును ప్రాతిపదికగా ఉపయోగించలేమని కోర్టు పేర్కొంది. 2020లో మరో క్రిమినల్‌ ‌కేసు నమోదైందని, 2026లో అలీని గూండాగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ రెండింటికీ మధ్య దాదాపు ఆరేళ్ల అంతరం వుందని కోర్టు పేర్కొంది. ఈ రెండింటి మధ్య హేతుబద్ధమైన సంబంధం లేదని స్పష్టం చేసింది. ఒక క్రిమినల్‌ ‌కేసులో జోక్యం వున్నంత మాత్రాన అలీని క్రిమినల్‌ ‌నేరాలకు పాల్పడే లేదా నేరాలకు ప్రేరేపించే నేరస్తుడిగా పేర్కొనలేమని కోర్టు పేర్కొంది. గూండా చట్టాన్ని అమలు చేయడానికి ప్రాతిపదికగా బీట్‌ ‌సమాచారం నివేదికను చూపించగా, దాన్ని కూడా బెంచ్‌ ‌తిరస్కరించింది. ఆ సమాచారం ప్రాతిపదికగా క్రిమినల్‌ ‌కేసు నమోదు కాలేదని, పైగా తన వాదన వినిపించుకునే అవకాశాన్ని అలీకి ఇవ్వలేదని, సహజ న్యాయ సూత్రాన్ని జిల్లా మేజిస్ట్రేట్‌ ఉల్లంఘించారని బెంచ్‌ ‌పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -