ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం కోరుతూ మధిరలో
36 మంది రైతులతో
36 ఏఐకేఎస్ జెండాల ఆవిష్కరణ : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ-బోనకల్
ఏఐకేఎస్ జాతీయ మహాసభలు నల్లగొండ జిల్లాలో జరుగుతున్న సందర్భంగా లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు. ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలంటూ తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బోనకల్లోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా 36వ ఏఐకేఎస్ జాతీయ మహాసభల సందర్భంగా 36 జెండాలను 36 మంది సీనియర్ రైతులు ఆవిష్కరించారు. తొలుత ఏఐకేఎస్ జెండాను పోతినేని సుదర్శన్ రావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఆ తర్వాత మిగిలిన జెండాలను రైతులు ఆవిష్కరించారు. 36 మంది రైతులు పంచకట్టులో హాజరు కావటంతో ఈ వినూత్న కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవటమే కాక చర్చనీయాంశంగా మారింది. ముందుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 36 జెండాలతో ప్రదర్శనగా స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ మీదుగా వీవీఆర్ గార్డెన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు పయ్యావుల ప్రభావతి మనవడు దేవాన్ష్ (3వ తరగతి) పంచె కట్టు, పెట్టుడు మీసాలతో హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పోతినేని, నున్నా మాట్లాడుతూ.. పదివేల మందితో భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఏఐకేఎస్ జాతీయస్థాయిలో రైతు సమస్యల పరిష్కారంలో విశేషమైన పాత్ర నిర్వహిస్తుందన్నారు. జాతీయ మహాసభలను జయప్రదం చేసేందుకు ఖమ్మం జిల్లా నుంచి ప్రధానంగా మధిర నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఏఐకేఎస్ జాతీయస్థాయిలో రైతుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ కీలక పాత్ర పోషించడమే కాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న చట్టాలు విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేస్తున్న సంఘం ఏఐకేఎస్ అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనలో ఏఐకేఎస్ కీలకపాత్ర నిర్వహించిందని అన్నారు. ఏఐకేఎస్ జాతీయ మహాసభల సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, సీఐటీయూ నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, ఎర్ర శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, మడిపల్లి గోపాలరావు, పొన్నం వెంకటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, కిలారు సురేష్, మద్దాల ప్రభాకర్, పయ్యావుల ప్రభావతి, జొన్నలగడ్డ సునీత, నల్లమోతు వాణి, బట్టు పురుషోత్తం, పడకంటి మురళి, మందా సైదులు, దేశబోయిన ఉపేందర్, దివ్వెల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో లక్ష మందితో బహిరంగ సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



