Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేజీబీవీ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది
 వేతనాలు పెంచాలి

కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది
 వేతనాలు పెంచాలి

- Advertisement -


నైట్‌ డ్యూటీలు రద్దు చేయాలి
వీక్లీ ఆఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలి : ధర్నాలో ఎమ్మెల్సీ కోదండరామ్‌, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి 
పోటు రంగారావు
నవతెలంగాణ-ముషీరాబాద్‌

​కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, వర్కర్ల వేతనాలు పెంచడంతోపాటు నైట్‌ డ్యూటీలను రద్దు చేసి, వీక్లీ ఆఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె.సూర్యం డిమాండ్‌ చేశారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ఎల్‌. పద్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 495 కేజీబీవీలు ఉండగా, సుమారు 7 వేల మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, వర్కర్లు తీవ్ర పనిభారంతో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని తెలిపారు. సిబ్బంది సమస్యలను శాసనమండలిలో చర్చించడంతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

పోటు రంగారావు మాట్లాడుతూ.. కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, వర్కర్ల వేతనాలను పెంచి, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఎస్‌పీడీ కార్యాలయం ఎదుట రెండు సార్లు ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేశామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు.
కె.సూర్యం మాట్లాడుతూ .. కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా, వివక్షతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి సిబ్బంది వేతనాలను సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.ఎల్‌. పద్మ, ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ.. మూడేండ్లుగా అధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని, ఇక పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. జీవో నంబర్‌ 6 ప్రకారం కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ్‌కుమార్‌, అరుణ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు హేమలత, షాహిబా, అలివేలు, వీరమణి, రాష్ట్ర నాయకులు శశికళ, సుమలత, అశోక్‌, సాంబశివుడు, రమేశ్‌, రమ, చంద్రకళ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -