Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోండి అందర్ని దొంగల్లా చూడొద్దు
మిల్లర్ల మహాధర్నాకు 
జూలకంటి రంగారెడ్డి మద్దతు
నల్లగొండ కలెక్టరేట్‌ ‌వద్ద ధర్నా..
రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల బంద్‌.. నిరసన
​నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​రైస్‌ మిల్లర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. రైస్‌ మిల్లర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మిల్లులను బంద్‌ ‌చేసి ధర్నాలు చేశారు. అందులో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన మహాధర్నానుద్దేశించి జూలకంటి మాట్లాడారు. మిల్లర్లపై దాడులు, తనిఖీలు, కేసులతో మానసిక ఒత్తిడికి గురిచేయడం సరికాదన్నారు. తప్పు చేసిన ఒకరిద్దరిపై చర్యలు తీసుకోవచ్చు కానీ, ఆ పేరుతో మొత్తం మిల్లింగ్‌ పరిశ్రమ యజమానులను నేరస్థులుగా చూడటం తగదన్నారు.​​ తెలంగాణలో వరి ప్రధాన పంటగా లక్షల ఎకరాల్లో సాగవుతోందని, రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటే రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమ సక్రమంగా నడవాల్సిందేనని స్పష్టం చేశారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసినప్పుడే రైతులకు మద్దతు ధర లభిస్తుందని, ప్రభుత్వానికి లెవీ బియ్యం అందడం తోపాటు ప్రజలకు అవసరమైన బియ్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైస్‌ మిల్లులపై వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. మిల్లింగ్‌ పరిశ్రమ దెబ్బతింటే రైతులు, కార్మికులు, మిల్లర్లు మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని వివరించారు. ప్రభుత్వం కేటాయించే ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి సీఎంఆర్‌ బియ్యం ఇవ్వడానికి మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే పచ్చి ధాన్యాన్ని నెలల తరబడి నిల్వ ఉంచి మిల్లింగ్‌ చేయడం వల్ల వచ్చే నూకలు, రంగు మారడం, డ్యామేజ్‌, పరము తదితర కారణాలతో ఏర్పడే నష్టాన్ని మొత్తం మిల్లర్లపైనే మోపడం అన్యాయమ న్నారు. మిల్లింగ్‌ చార్జీలు తీసుకుంటూ పరిశ్రమ నడిపే మిల్లర్లు ప్రతి నష్టాన్నీ భరించలేరని, నష్టపోయి ఎవరూ పరిశ్రమ నడపలేరని స్పష్టం చేశారు. మిల్లింగ్‌ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం సకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు.​ ప్రభుత్వానికి సీఎంఆర్‌ బియ్యం ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి, అధికారులు మిల్లర్లతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మిల్లర్లు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను వివరించడంతోపాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.

​రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
​రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రైస్​ మిల్లులపై కొనసాగుతున్న విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్​ దాడులను వెంటనే నిలిపివేయాలని, మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం మానుకోవాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న మిల్లింగ్​, హమాలీ చార్జీలు, కమీషన్​ బకాయిలను వెంటనే చెల్లించాలనే తదితర 13 ప్రధాన డిమాండ్లతో జిల్లా వ్యాప్తంగా మిల్లులను బంద్​ చేసిన సిబ్బంది, హమాలీలు, మిల్లర్లు నల్ల కండువాలు ధరించి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బైల్డ్ రైస్ మిల్ జిల్లా అధ్యక్షులు చేపూరి నాగరాజు మాట్లాడారు.నిజామాబాద్‌ నగరంలోని ధర్నాచౌక్ వద్ద జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌, ది డిస్టిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

​మిల్లింగ్‌ ‌బకాయిలు ఇవ్వాలి
రాష్ట్ర వ్యాప్తంగా రైస్‌ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్‌ చేశారు. 2018 నుంచి ఇప్పటివరకు మిల్లింగ్‌కు సంబంధించిన సుమారు రూ.7 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా మిల్లింగ్‌ చార్జీలు పెంచాలని, క్వింటాల్‌కు రూ.10 చార్జీ ఏమాత్రం సరిపోదని చెప్పారు. ధాన్యం నాణ్యత, తేమ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా 67 కిలోల బియ్యం ఇవ్వాలనే నిబంధనతో ఒత్తిడి చేయడం సరికాదన్నారు.​ రాష్ట్రం నుంచి సుమారు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకోవాల్సి ఉండగా 40 లక్షల మెట్రిక్‌ టన్నులకే పరిమితం చేయడం వల్ల సంక్షోభం మరింత తీవ్రమైందన్నారు. మార్కెట్‌ లైసెన్సులు మంజూరు చేసి పెండింగ్‌ లైసెన్సులు రెన్యూవల్‌ చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరెపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి.సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్ హాజరై సంఘీభావం తెలిపారు.
తమ్మల వీరారెడ్డి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -