రష్యా అధ్యక్షుడు పుతిన్
స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం పెరగాలి : పెజెష్కియాన్
ఆర్థిక వారధులను నిర్మిస్తున్న భారత్: బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశాల్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : 20వ శతాబ్దం చివరి వరకు అగ్ర స్థానాల్లో వున్న దేశాల స్థానే కొత్తగా ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలు వచ్చి చేరుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ఈ పోటీ ఇప్పుడు వికృత రూపాలను అంటే సైనిక దాడులు, ఆంక్షల బెదరింపులు వంటి రూపాలను సంతరిం చుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచంలో నిర్మాణాత్మకమైన, వ్యవస్థా గతమైన మార్పులకు లోనవుతోందని పుతిన్ అన్నారు. 20వ శతాబ్దం ద్వితీయా ర్ధంలో ఆర్థిక అభివృద్ధికి అగ్రగామిగా నిలిచిన దేశాల స్థానే క్రమేపీ నూతన అభివృద్ధి చోదక శక్తులు ఆక్రమిస్తున్నాయని పుతిన్ పేర్కొ న్నారు. అయితే ఈ దేశాలు ఇంకా బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలను, సాంకేతి కతను, శాస్త్రీయ అవకాశాలను కలిగివు న్నాయనే వాస్తవాన్ని మనం గుర్తిం చాలన్నారు. మానవాళి స్వభావం, ఆర్థిక వ్యవస్థ రెండూ మార్పు చెందుతునే వుంటా యన్నారు. ఈ మార్పుతో పాటూ రష్యాకు చెందిన పశ్చిమ దేశాల పోటీదారులు తమ పూర్వపు పోటీ తత్వాన్ని తిరిగి సముపార్జిం చుకునేందుకు శాయశక్తులా పనిచేస్తున్నారని పుతిన్ పేర్కొన్నారు. అయితే ఈ పోటీతత్వం అనేది చాలాసార్లు వికృత చేష్టలతో ముడిపడి వుంటుందన్నారు. భౌతిక దాడులకు దిగడం, చమురు పైప్‌లైన్లు ధ్వంసం చేయడం, అంతర్జాతీయ రవాణా కారిడార్లను అడ్డుకోవడం,సముద్రపు నౌకలను స్వాధీనం చేసుకోవడం, అక్రమంగా ఇతరత్రా ఆంక్షలు విధించడం వంటి చర్యలకు దిగుతూంటారని అన్నారు.
స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం పెరగాలి : పెజెష్కియాన్
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడడం వల్ల ఎదురయ్యే ముప్పులు, ప్రమాదాల గురించి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. స్థానిక కరెన్సీల్లో బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం పెరగాలని పిలుపిచ్చారు. ఆర్థిక భద్రతను దేశ, ప్రాంతీయ భద్రత నుండి ఎలా వేరుచేయలేమో తమ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన దాడులు రుజువు చేశాయని అన్నారు. రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి ఆర్థిక సాధనాలను ఉపయోగించడం పెరిగిందని అన్నారు. ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సవాల్ళకు బ్రిక్స్ దేశాల స్పందన ఎలా వుండబోతోందో చెప్పాలని ఆయన అక్కడ వున్న నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఒక ఆర్ధిక సాధనంపై లేదా సాంకేతికతపై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఏ దేశమూ మరో దేశం యొక్క చట్టబద్ధమైన వాణిజ్యాన్ని దెబ్బతీయలేని వాతావరణాన్ని బ్రిక్స్ సృష్టించాలని ఆయన కోరారు. ఇందుకు గానూ గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా వాటి అంతర్గత బలాన్ని పరిపుష్టం చేయాలన్నారు. ఆర్థికంగా ఎలాంటి దెబ్బలు తగిలినా, సంక్షోభాలు ఎదురైనా వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులను, వ్యవస్థలను నిర్మించాల్సి వుందన్నారు.
ఆర్థిక వారధులను నిర్మిస్తున్న భారత్
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు, అవరోధాలు పెరుగుతుండగా మరోపక్క భారత్ ఆర్ధిక వారధులను నిర్మిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ‘‘అడ్డంకులను తగ్గించడం, వ్యాపార, వాణిజ్యాలకు గల అవకాశాలను పెంపొందించడం ఇదొక్కటే తమ దృక్పథమని స్పష్టంచేశారు. 2014 నుంచి భారత్, దాదాపుగా 40దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఏడాది బ్రిక్స్‌దేశాల అధ్యక్ష స్థానం హోదాలో వ్యవసాయం, ఆరోగ్యం, నైపుణ్యాలు, స్మార్ట్ గ్రిడ్‌లు వంటి రంగాల్లో కొత్త సహకార నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ భారత మంటపంలో జరుగుతున్న బిజినెస్ ఫోరం సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్టార్టప్‌లను, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)లను మార్కెట్లు, ఫైనాన్స్‌తో అనుసంథానించేం దుకు బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్, బ్రిక్స్ ఎంఎస్‌ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నొవేషన్ ఫండ్ వంటి అదనపు చొరవలను భారత్ చేపట్టిందని తెలిపారు.
‘‘సముద్రమార్గాలన్నీ సురక్షితంగా వున్నపుడు, సరఫరా మార్గాలు తెరిచివున్నపుడు, నావికులకు భద్రత వున్నపుడు మా త్రమే అంతర్జాతీయ వాణిజ్యం ముందుకు సాగుతుంది’’అని మోడీ స్పష్టంచేశారు. మొత్తంగా ప్రపంచ జనాభాలో 50శాతం బ్రిక్స్ దేశాల్లోనే వున్నారని, అంతర్జాతీయ జీడీపీలో 40శాతం వాటా ఈ దేశాలదేనని, వాణిజ్యంలో 25శాతానికి పైగా వాటా ఈ దేశాలదేనని మోడీ గుర్తు చేశారు. ‘‘అదొక్కటే కాదు, ఇన్నేళ్ళలో అంతర్జాతీయ జిడిపి దాదాపుగా రెండున్నర రెట్లు పెరగగా, బ్రిక్స్ దేశాల సంయుక్త జీడీపీ ఏకంగా దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగింది.’’ అని మోడీ తెలిపారు. అంటే బ్రిక్స్ దేశాల ఆర్థిక శక్తిసామర్ధ్యాలు ప్రపంచ ఆర్థికవ్యవస్థ శక్తి సామర్ధ్యాలతో పోలిస్తే దాదాపుగా రెట్టింపుగా వుందన్నారు.



