Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవేతనాల తగ్గింపు ఆదేశాలను ఉపసంహరించుకోవాలి

వేతనాల తగ్గింపు ఆదేశాలను ఉపసంహరించుకోవాలి

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాల తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబుకు ఆయా సంఘాల నాయకులు పాలడుగు సుధాకర్‌, జైపాల్ రెడ్డి, మద్దిలేటి, కె. సూర్యం, అంజప్ప, శివబాబు తదితరులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సుమారు 60 వేల మంది కార్మికులు వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రాణాంతకమైన అంటువ్యాధుల నుండి ప్రజలను కాపాడుతూ నిత్యం మురికి మలినాలతో కూడిన పారిశుద్ధ్యం, డ్రైనేజ్ తదితర ప్రమాదకరమైన పనులలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కార్మికులు ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఆ కార్మికుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించక పోవడం బాధాకరమని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, కేటగిరీల వారిగా వేతనాలు చెల్లించాలని ఆందోళన – పోరాటాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందేనని పేర్కొన్నారు. వారి వేతనాలు పెంచకపోగా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్, వర్క్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రిషియన్, లైన్‌‌మెన్, డ్రైవర్, వాటర్ మెన్స్, బిల్ కలెక్టర్, శానిటరీ జవాన్, శానిటరీ ఇనిస్పెక్టర్, ఎన్ఎంఆర్ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు తగ్గించి ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం బాధగా ఉందని తెలిపారు. ఇది చట్టవ్యతిరేకమైన చర్య అని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 12-07-2026న ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో ఆర్టీ . ఆర్టి నెం. 1181ని కార్మికులకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు తగ్గిస్తూ మున్సిపల్ కమీషనర్లకు ఆదేశాలు పంపించారని తెలిపారు. ఈ నిర్ణయం కార్మికులకు నష్టమని పేర్కొన్నారు. ఆ ఆదేశాలను ఉపసంహరించుకొని కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలనీ,ఎన్‌ఎంఆర్‌ కార్మికుల వేతనాలు తగ్గిస్తూ రూ. 16,600లు చెల్లించాలనే నిర్ణయాన్ని నిలిపివేయాలని ‌డిమాండ్‌ ‌చేశారు. జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు జిహెచ్ఎంసి వేతనాలు చెల్లించాలని, మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు, వితంతు, వృద్ధాప్య పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని కోరారు. కార్మికులకు రిటైర్‌‌మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, మరణించిన, 60 సంవత్సరాలు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ వినతి పత్రాన్ని సీపీఐ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావుకు కూడా సమర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -