గర్భిణుల్లో అలసట తరచూ చూసే సమస్యే. తొలి నెలల్లో గర్భధారణకు అనుగుణంగా మారటానికి శరీరం ప్రయత్నిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిండం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. ఇందుకు చాలా శక్తి ఖర్చవుతుంది. హార్మోన్ల మార్పులతో ఒక పక్క నిద్ర ముంచుకొస్తుంటుంది. ముఖ్యంగా, ప్రొజెస్టిరాన్ మోతాదులు పెరగటం అలసటకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు గర్భం ధరించినప్పుడు రక్తం పరిమాణమూ పెరుగుతుంది. దీంతో గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఇందుకోసం తెలియకుండానే ఎంతో శక్తి హరించుకుపోతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం…
గర్భధారణ సమయంలో మానసిక, భావోద్వేగాల అలజడి కూడా అలసటకు కారణమంటున్నారు నిపుణులు. సంతానాన్ని కంటున్నామనే సంతోషమే కాదు.. డెలివరీ ఎలా అవుతుంది? ఏ హాస్పిటల్లో చేరాలి? ఎంత ఖర్చవుతుంది? పిల్లలను ఎలా పెంచాలి? అనే ఆలోచనలూ మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. మొదటి సారి తల్లి అవుతున్నపుడు ఈ సందేహాలు, ఆందోళన సహజమే. ముఖ్యంగా చిన్న కుటుంబాల్లో ఇది మరింత సృష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రభావం శరీరం మీదా పడుతుందని నిపుణులు అంటున్నారు. చిన్నచిన్న నొప్పులు, అసౌకర్యం, రాత్రిపూట మూత్ర విసర్జన కోసం చాలాసార్లు నిద్రలేవటం వంటివన్నీ అలసటకు దారితీస్తాయి.
ఎప్పుడు ఎక్కువ వుంటుంది?
సాధారణంగా గర్భాదరణ జరిగిన తొలి త్రైమాసికం.. అంటే 6 నుంచి 8 వారాల మధ్యలో అలసట చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొందరికిది ముందూ వెనక అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రెండో త్రైమాసికంలో కాస్త ఉత్సాహంగా అనిపించినా, మూడో త్రైమాసికంలో మళ్లీ అలసట రావడం సహజమని చెబుతున్నారు. దీనికి తొలి త్రైమాసికంలో హార్మోన్లు కారణమైతే మూడో త్రైమాసికంలో నిద్ర పట్టకపోవటం, అసౌకర్యమే కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
మరి దీని నుండి బయటపడేదెలా?
సురిక్షతమైన వ్యాయామాలు : చాలా మందికి ఇది కాస్త విరుద్ధంగా అనిపించొచ్చు. అసలే, అలసిపోతుంటే ఇక వ్యాయామాలు ఎలా చేస్తాం? అనుకోవటం కూడా సర్వసాధారణం. కానీ, గర్భిణులకు సురక్షితమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు హుషారును కలిగించే ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయని నేచర్ అనే అధ్యయనం చెబుతోంది. కాబట్టి, డాక్టర్ల సలహా మేరకు తగిన వ్యాయామాలు చేయాలట.
తగినంత నీరు : ఇది తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తగినంత నీరు తాగితే శరీర ప్రక్రియలన్నీ సజావుగా, తేలికగా సాగుతాయని అంటున్నారు. అలాగే తక్కువ శక్తి ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. ఫలితంగా, ఉత్సాహమూ కలుగుతుందట. అయితే తగినంత నీరు తీసుకుంటుంటే.. మూత్రం లేత పసుపు రంగులో వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ మూత్రం రంగు గాఢంగా కనిపిస్తే నీరు, ద్రవాలు అంతగా తీసుకోవటం లేదని అంటున్నారు.
కెఫెన్ తగ్గించండి : అలసటగా లేదా నీరసంగా అనిపించినప్పుడు కాఫీ తాగితే హుషారు కలుగుతుంది. అలాగని, మరీ ఎక్కువగా కెఫెన్ తీసుకున్నా ఇబ్బంది తప్పదని అంటున్నారు నిపుణులు. రోజుకు 200 మిల్లీ గ్రాములకు మించకుండా చూసుకోవాలని చెబుతున్నారు. కెఫెన్తో మూత్రం ఎక్కువగా వస్తుందని కూడా అంటున్నారు. తగినన్ని ద్రవాలు తీసుకోకపోతే శరీరంలో నీటి శాతం తగ్గుతుందని వివరిస్తున్నారు. ఇది నిస్సత్తువ, అలసటకు దారితీస్తుందంటున్నారు. ఈ క్రమంలో సాయంత్రం పూట టీ, కాఫీ లేదా కోలా పానీయాలకు దూరంగా ఉండాలని nhs.uk పేర్కొంది. ఎందుకంటే, వాటిలోని కెఫెన్ నిద్ర పట్టడాన్ని కష్టతరం చేస్తుందని తెలిపింది.
సమతులాహారం : గర్భం ధరించినప్పుడు వికారం వల్ల సరిగా తినకపోవటం సాధారణమే. ముఖ్యంగా, అలసిపోయినప్పుడు, వికారంగా అనిపించినప్పుడు తినటం మరింత కష్టంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయినా ఆరోగ్యకరమైన ఆహారం తినేలా చూసుకోవటానికే ప్రయత్నించాలని అంటున్నారు. పండ్లు, కూరగాయలు, పలుచటి మాంసకృత్తులు ఎక్కువగా తీసుకోవాలని వివరిస్తున్నారు. ఇవి శరీర పోషణకే కాకుండా శక్తి పెంపొందటానికీ తోడ్పడతాయని పేర్కొంటున్నారు.



