డా. శ్రీభాష్యం అనూరాధ… చిన్నతనం నుండి తెలుగు భాషపై మక్కువ పెంచుకున్నారు. ప్రస్తుతం సాంఘిక గురుకుల పాఠశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. తాను సాహిత్యంలో రాణించడంతో పాటు తన విద్యార్థినులను కూడా ఆవైపుగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలతో కవితలు, కథలు రాయిస్తూ పుస్తకాలు ముద్రిస్తున్నారు. అంతేకాదు బాలికల సాధికారత కోసం తన వంతు కృషి చేస్తున్నారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించినపుడే వారి భవిత బాగుంటుందంటున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
మాది వరంగల్ (ప్రస్తుతం జనగామ జిల్లా) ఖిలాషాపూర్ గ్రామం. సర్వాయి పాపన్న వంటి వీరుల పురిటిగడ్డ, సాహితీ పూదోట, కళాకారులతో ఓలలాడే నేల, సకలకళాక్షేత్రం. అలాంటి నేలపై పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను. శ్రీభాష్యం వేంకటాచారి, వకుళాదేవి నా తల్లిదండ్రులు. మేము నలుగురు అక్క చెల్లెళ్లం,ఇద్దరు అన్నదమ్ములం. నాభర్త ఉత్తలూరు అశోక్. వీరు టీఎస్ డైరీలో జనరల్ మేనేజర్గా పనిచేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధికై ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేశారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. అలేఖ్య, ఇంజనీరింగ్ పూర్తి చేసింది., అభిజ్ఞ, ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అలేఖ్యకి వివాహం అభిజిత్ సింహతో జరిగి, అమెరికాలో ఉంటుంది. ఇద్దరు మనుమళ్ళు అశ్వత్ సింహ, అథర్వ్ సింహ.
నాలో భావాలకు చైతన్యం కలిగింది
1996 నుండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పని చేస్తున్నాను. చిన్నప్పటి నుండి తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. నాన్న చదివించే దినపత్రికలు, స్కూల్లో వార్తలు చదవడం వల్ల భాషా నైపుణ్యాలు వంటబట్టాయి. లేఖలు రాయడంతో రచనకు మార్గదర్శకమైంది. చిన్నచిన్న అనుభవాలను డైరీలో రాస్తూ రాస్తూ కవితలు రాయడం మొదలుపెట్టాను. 2002లో పరిశోధనా సిద్ధాంత గ్రంథం “తొలి నాటి సాంఘిక నవలల్లో- స్త్రీ” రాసే నాటిక నాలో భావాలకు చైతన్యం కలిగింది. వాటిని అక్షర రూపంలో పెడుతూ అమ్మానాన్న జ్ఞాపకాలతో “జ్ఞాపిక” 2010లో ప్రచురించాను. అనేక పత్రికలకు వ్యాసాలు, కథలు రాసి పంపే దాన్ని. నాగఫణిశర్మ ఢిల్లీలోనిర్వహించిన “అవధాన రాజధాని” అనే అవధాన కార్యక్రమంలో పాల్గొన్నాను. పలు యుజిసి సదస్సులలో పత్ర సమర్పణలు కూడా చేశాను. గురుకుల సంస్థలో తెలుగు బోధనాభ్యసన కార్యక్రమాలలో శిక్షకురాలిగా, ‘బ్రిడ్జ్ కోర్స్’ ఐదవ తరగతి పుస్తకరచనలో భాగస్వామ్యం వహించాను.
బాలికల సాధికారతకై…
మా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా 2015లో అవార్డు అందుకున్నాను. బాలిక సాధికారతకై విద్యార్థులను పలు అంశాలలో ప్రోత్సహిస్తున్నాను. 2015లో “అశోక్ అనుబంధం” అనే పుస్తకాన్ని నా శ్రీవారి ఘనత తెలుపుతూ (రంజీ క్రికెట్ ప్లేయర్) ముద్రించాను. మన సంస్కృతిని చాటి చెప్పే బతుకమ్మ పండగ గురించి, చిన్ననాటి నుండి షాపురం గ్రామంలో పాడిన పాటలు సేకరించి, కొన్ని నేను రచించినవి కలిపి “బతుకమ్మ పాటలు” అనే పుస్తకాన్ని ప్రచురించాను. వివిధ కవి సమ్మేళనాలు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేశాను. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో నా కవితా గానం వినిపించి సత్కారం పొందాను. వివిధ సందర్భాలలో వివిధ సంస్థలు ప్రచురించిన పుస్తకాల్లో నా రచనలు రావడం నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఆయుత కవితా యజ్ఞం వారిచే “శతశ్లోక కంఠీరవ” బిరుదును పొందాను.
మహిళా అభివృద్ధి- సాహిత్యం
నేను చేస్తున్న వృత్తిలో సాహితీ సేవ చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాను. మా సంస్థ వారు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో 2015-16; 2017-18 లలో “మహిళా అభివృద్ధి- సాహిత్యం” అనే అంశంపై ప్రదర్శనలు చేసి, రాష్ట్రస్థాయి నగదు పురస్కారం అందుకున్నాను. వీరు నిర్వహించిన “స్వేరో ఆథర్స్” అనే అంశంలో మా విద్యార్థి ‘శ్రావణి’ని ప్రోత్సహించి, కథలు రాయించి నగదు పురస్కారం పొందాము. కృష్ణవేణి అనే విద్యార్థినిచే “ఓ స్వేరో భావ విప్లవం” అనే పేరుతో కవితలను పుస్తకరూపంలో ప్రచురించాను. 2015 నుండి ఇప్పటివరకు నేను పనిచేసిన కళాశాలలో ప్రతి ఏడాది వార్షిక సంచికలు (విద్యార్థుల రచనలతో) విడుదల చేస్తున్నాను. ప్రత్యేక రోజుల్లో విద్యార్థులను సమావేశపరచి, వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ, స్వీయ అభిప్రాయాలతో భాషపై మక్కువ, సంస్కృతిపై అవగాహన, దేశభక్తి పెంచుతున్నాను. అంతే కాదు కరోనా సమయంలో విద్యార్థులు విద్యకు దూరం కాకుండా, టిశాట్ తరగతులు, పాఠ్యాంశాలను బోధించి యూట్యూబ్ ద్వారా విద్యార్థులకు అందించాను. అదే సమయంలో ప్రచురించిన సంఘటిత, లేఖాసాహిత్యం పుస్తకాల్లో నా రచనలు ప్రచురించబడ్డాయి.
పిల్లల రచనలతో…
తెలంగాణా భాషాసాంస్కృతిక శాఖ నిర్వహించిన కథాసాహిత్య కార్యశాలలో నేను, మా విద్యార్థులం పదహారు మంది పాల్గొన్నాం. 2023లో తెలుగు మ్యాగజైన్ “భావలోగిలి’’ విద్యార్థుల రచనలు ప్రచురించాను. 2024లో నా విద్యార్థుల రచనలను సేకరించి నా సంపాదకత్వంలో మూడు పుస్తకాలు (ముగ్గరిముచ్చట్లు, కథలు – కవితలు, ఒంటరిగది- కవితలు, మాటలదరువు – పాటలు, కవితలు) ముద్రించాను. విద్యార్థులను జీవితంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది, దేశభక్తిని పెంచి, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విధంగా, విలువలతో కూడిన విద్య అందిస్తూ వారి భవితలను తీర్చిదిద్దుతున్నాను. ఇది నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ, సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తూ, తెలుగు భాష వ్యాప్తికై జీవితాన్ని గడుపుతాను.
సేకరణ: అచ్యుతునిరాజ్యశ్రీ



