Tuesday, August 4, 2026
E-PAPER
Homeమానవిజెండర్‌ ‌మనల్ని ఆపకూడదు

జెండర్‌ ‌మనల్ని ఆపకూడదు

- Advertisement -

పడమటి అన్వితా రెడ్డి… పట్టుదల ఉంటే ఎదైనా సాధించగలం అనడానికి నిదర్శనం. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. తెలంగాణ నుండి ఈ ఘనత సాధించిన రెండో మహిళగా గుర్తింపు పొందింది. 18 నెలల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలు అధిరోదించాలనే సంకల్పంతో ప్రయాణం మొదలుపెట్టి 2022 నాటికి నాలుగు పర్వతాల శిఖరాగ్రాలను అధిరోదించింది. 2023లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకుంది. ఇటీవలె నార్త్‌ అమెరికన్‌‌లో అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఒంటరిగా అధిరోహించి తన రికార్డును తానే బద్దలు కొట్టిన ఆమె పరిచయం నేటి మానవిలో…

మా సొంత ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా, యర్రంబెల్లి గ్రామం. అమ్మ చంద్రకళ, నాన్న మధుసుదర్‌‌రెడ్డి. నాకు ఒక అక్క ఉంది. మా అమ్మ అంగన్‌‌వాడీ టీచర్‌. మా చదువుల కోసం భువనగిరిలో ఉంటున్నాం. మా ఇంటి బయటకు వెళితే భువనగిరి గుట్ట కనిపించేది. అయితే ఓ మౌంటెనెర్‌ ‌కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే మా గుట్ట చూసినప్పుడల్లా పెద్ద పెద్ద పర్వతాలు ఎలా ఎక్కుతారో అనే కుతూహలం ఉండేది. దాంతో ట్రైనింగ్‌ ‌తీసుకుంటానని ఇంట్లో గోల చేశాను. అయితే నాన్నకు అప్పట్లో పెద్ద ఆసక్తి లేదు. పడిపోతాననో, దెబ్బలు తగులుతాయనో భయపడలేదు. ‘చదువుకుంటున్నావు కదా ముందు చదువు పూర్తి చెయ్యి’ అనేవారు. అయితే నాకు మాత్రం చాలా ఆసక్తి ఉండేది. దాంతో పట్టుదలతో ఆ కోర్సులో చేరాను. అలా నా 17 ఏండ్ల వయసులో 2015 సెప్టెంబర్‌‌లో భువనగిరిలోని రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్లో ఐదు రోజుల కోర్సు పూర్తి చేశాను. మొదట చిన్నచిన్న కొండలు అంటే సిక్కింలోని రీనాక్‌, బీసీ రాయ్‌ వంటివి ఎక్కాను.

చరిత్ర సృష్టించి
నా దృష్టిలో భువనగిరి కొండనే నాకు పెద్ద ఎవరెస్టు. అదే నాకు ఎవరెస్టు ఎక్కడానికి ప్రేరణ. ఎవరెస్టు ఎక్కడం నాకు దక్కిన మంచి అవకాశం. 2022 మే 16న ఉదయం 9:30కి ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎవరెస్ట్‌ (8848.86 మీటర్లు) శిఖరాన్ని అధిరోహించి, తెలంగాణ నుండి ఈ ఘనత సాధించిన రెండో మహిళగా గుర్తింపు పొందాను. ప్రపంచంలో ఎనిమిదో ఎత్తయిన నేపాల్‌లో సముద్ర మట్టానికి 8,163 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్‌ మనస్లు పర్వతాన్ని 2022 సెప్టెంబరు 28న అధిరోహించాను. ఈ పర్వతాన్ని అధిరోదించిన తొలి భారతీయురాలిగా నిలిచినందుకు చాలా గర్వపడుతున్నాను. భువనగిరి కోటపై శిక్షణ పొందిన నేను రష్యాలో మంచుతో కప్పి ఉండే 18,510 అడుగుల ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని 2021 డిసెంబరు 7న మైనస్‌ 40డిగ్రీల చలిలో అధిరోహించాను. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా పర్వతారోహకురాలిగా రికార్డు పొందాను. 2015లో సిక్కింలోని 4,800 మీటర్ల ఎత్తైన రినాక్‌ పర్వతాన్ని, 2019లో 6,400 మీటర్ల బీసిరాయ్‌ పర్వతాన్ని, 2020 జనవరిలో 5,896 మీటర్ల ఎతైన కిలిమంజారో పర్వతాన్ని, 2021 ఫిబ్రవరిలో లద్దాఖ్‌లోని 6వేల మీటర్ల ఎత్తైన ఖడే పర్వతాన్ని అధిరోహించాను.

దేనికైనా సిద్ధంగా ఉన్నాను
జెండర్‌ అనేది మనల్ని ఆపకూడదు. అది మనకు బలం కావాలి. మా అమ్మను చాలా మంది అడిగేవాళ్లు. ‘దెబ్బలు తగిలించుకొని వస్తుంది, ఒంటరిగా అంతంత దూరం వెళుతుంది, ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, రేపు పెండ్లి ఎలా అవుతుంది’ అని. అదే ప్రశ్న మా అమ్మ నన్ను అడిగితే ఏమైతది మహా అయితే నాపై లైంగిక దాడి చేస్తారేమో అనేదాన్ని. అప్పుడు నా వయసు 22. దాంతో అమ్మ ముఖంలో రంగులు మారిపోయాయి. ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది అనుకునేది. అప్పుడు నేను ఒకటే చెప్పాను. మనిషి చనిపోవాలంటే కొండలే ఎక్కాల్సిన పని లేదు. రోడ్డుమీద పోతున్నా చచ్చిపోవచ్చు. నేను దానికి భయపడను. చావుకు భయపడి నేను ఆగిపోదలచుకోలేదు అన్నాను. నాకేం జరిగినా ఎదుర్కోడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే సమాజం కూడా నన్ను అంగీకరిస్తుంది అన్నాను. దాంతో మా అమ్మ నన్ను అర్థం చేసుకుంది.

మౌంటెనర్ల సంఖ్య పెరగాలి
నేను నేర్చుకున్న రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్లోనే ఇప్పుడు గైడ్‌‌గా ఉన్నాను. చాలా మందికి శిక్షణ ఇస్తున్నాను. భువనగిరితో పాటు ఆంధ్ర, లద్దాఖ్‌‌లో మా బ్రాంచ్‌‌లు ఉన్నాయి. దేశంలో మౌంటెనర్ల సంఖ్య పెంచాలి అనేది నా కల. నేను ట్రైనింగ్‌ ఇచ్చిన వారిలో ఇప్పటికీ పది వేల మంది పర్వతాలు ఎక్కారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు అత్యంత ఎత్తయిన పర్వతాలను 18 నెలల వ్యవధిలో అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకొని 2022 డిసెంబరు 17 నాటికి ఐరోపా‌లోని ఎల్‌బ్రస్‌, ఆఫ్రికాలోని కిలిమంజారో, ఆసియాలోని ఎవరెస్ట్‌, అంటార్కిటికాలోని మౌంట్‌ విన్సన్‌ శిఖరాలను ఎక్కాను. త్వరలోనే దక్షిణ అమెరికాలోని అకాంకాగువా, ఆస్ట్రేలియాలోని కార్టెన్జ్‌ పిరమిడ్‌, ఉత్తర అమెరికాలోని డెనాలీ పర్వతాలను అధిరోహించేందుకు ప్లాన్‌ ‌చేసుకున్నాను.

మనకు ఏది నచ్చితే అదే ఎవరెస్టు
ఎవరెస్టు ఎక్కితేనే విజయం సాధించినట్టు కాదు. ఏ వయసులో ఏం చేయాలన్నా ప్రారంభించవచ్చు. మనకు ఏది నచ్చితే అదే ఎవరెస్టు. అన్వితా గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీ నాకు స్పాన్సర్‌ ‌చేస్తుంది. నా గురించి ఓ ఆర్టికల్‌‌లో చూసి వాళ్ల అమ్మాయి పేరు కూడా అన్వితా కావడంతో నాకోసం స్పాన్సర్‌ ‌చేస్తున్నారు. అంతే నా నుండి వాళ్లు ఏమీ ఆశించడం లేదు. నా దగ్గర డబ్బులేదు. కానీ సాధించగలను అనే మనోధైర్యం ఉంది. మా నాన్న రైతు కాబట్టి మంచి తిండి తినగలుగుతున్నాను. గ్రామీణ వాతావరణంలో మంచి వ్యక్తుల మధ్య, బర్లు, కోళ్లు, చెట్ల మధ్య పెరగడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి వ్యక్తుల మధ్య స్వచ్ఛంగా పెరిగాను కాబట్టి నాకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. 2026 జూన్‌ 18 నార్త్‌ అమెరికాలోని అత్యంత ఎత్తైన పర్వతం ఎక్కాను. ఇది నా కల. నెరవేర్చుకోగలిగాను. ఎవరి సపోర్ట్‌ ‌లేకుండా, ట్రైనింగ్‌ ‌లేకుండా నా అంతట నేనే శిక్షణ తీసుకొని వెళ్లాను. 24 రోజులు అనుకున్నది పది రోజుల్లోనే పూర్తి చేయగలిగాను. నేను ఇది కూడా చేయగలను అనే నమ్మకం వచ్చింది.

నాపై నాకు నమ్మకం పెరిగింది
పదో తరగతి వరకు నేను చాలా డల్‌‌ స్టూడెంట్‌‌ని. ఎప్పుడూ ఓ అభద్రతా భావంలో ఉండే ఓ సాధారణ అమ్మాయిని. పెద్దగా చదివేదాన్ని కాదు. ‘ఇక చదువు రాదేమో, ఏం చేయాలేనేమో’ అనే భావన ఉండేది. శారీరకంగా బలంగా ఉన్నా మానసికంగా అంత ధైర్యంగా ఉండేదాన్ని కాదు. ఈ ఫీల్డ్‌‌లోకి వచ్చిన తర్వాత నాలో ఓ కొత్త అన్వితను చూసుకోగలిగాను. మా నాన్న కూడా ఇది గమనించారు. నాలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయారు. నాపై నాకు నమ్మకం పెరిగింది. చదువులో కూడా చాలా మార్పు వచ్చింది. దాంతో నాన్న చాలా ప్రోత్సహించారు. ఒకప్పుడు పాస్‌ అయితే చాలు అనుకునే దాన్ని కానీ తర్వాత యూనివర్సిటీలో బెస్ట్‌ ‌పది మందిలో ఒకదానిగా నిలవగలిగాను. దీనికి కారణం మౌంటెనీరింగ్‌. ఇదే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పర్వతాలు ఎక్కుతూనే డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేశాను.

సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -