Thursday, June 4, 2026
E-PAPER
Homeమానవిప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత

ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత

- Advertisement -

ఎవరికైనా చిన్నతనంలో ఆడే ఆటలు, చేసే పనులు కొన్ని మనసు మీద బాగా ప్రభావం చూపుతాయి. అవే పెరిగి పెద్దగయిన తర్వాత కొందరి జీవితంలో ప్రతిబింబిస్తాయి. అలా ప్రభావితం చెందిన వారే మధులిక. పర్యావరణం మనిషి మనుగడకు ఎంతో అవసరం. మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కానీ మనం చేతులారా వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం. నీరు, భూమి, గాలి అన్నీ కాలుష్యంగా మారి అనేక రోగాల బారిన పడుతున్నాం. ఈ కాలుష్య సమస్యల నుండి వాతావరణాన్ని కాపాడడం తన బాధ్యతగా భావించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె చేస్తున్న కృషి గురించి నేటి మానవిలో…

చిన్నప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ బాగా చూసేదాన్ని. అది నాపై ఎంతో ప్రభావం చూపిందని చెప్పాలి. నిజానికి నేను చదివిన చదువుకు చేసే పనులకు ఎక్కడా పొంతన కూడా లేదు’ అంటారు మధులిక. ప్రకృతి ప్రేమికురాలైన మధులిక చెరువులు ప్రక్షాళన చేయడం, చెరువు చుట్టూ మొక్కలు నాటడం వంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ఎంతో కృషి చేస్తున్నారు.

ప్రకృతి లేనిదే మానవ మనుగడ లేదు
మనిషికి ప్రకృతికి అవినావ భావ సంబంధం ఉంది. ప్రకృతి లేనిదే మానవ మనుగడ లేదు. అటువంటింది నేడు మనం ప్రకృతిని అనేకరకాలుగా ధ్వంసం చేస్తున్నాం. ముఖ్యంగా నదులు, సరస్సులు, చెరువులు మొదలైనవి. మానవ మనుగడకు నీరు ఎంతగానో అవసరం. అటువంటి నీటిని అపరిశుభ్రం చేస్తూ ఎందుకూ పనికి రాకుండా చేస్తున్నారు. మనం తాగే మంచినీటిలో కాలుష్యపు, మురికి నీరు వచ్చి కలవడం వల్ల ప్రజలు, జంతువులు అనారోగ్యాలకి గురవుతున్నారు. ఈ కాలుష్య వాతావరణం మధులికను ఎంతో కదిలించింది. పర్యావరణం కాపాడుకోవడం తన బాధ్యతగా భావించారు. ఇదే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.

దేశంపై మమకారంతో…
రాజస్థాన్‌‌కి చెందిన మధులిక తల్లిదండ్రులు ఇద్దరూ శాస్త్ర వేత్తలు. ఉన్నత పదవుల్లో పని చేసి పదవీ విరమణ పొందారు. మిగిలిన కుటుంబ సభ్యులు కెనడాలో స్థిరపడ్డారు. భారతదేశం మీద ఉన్న మమకారంతో ఈమె మాత్రం ఇక్కడే స్థిరపడి పోయారు. తన చిన్నతనంలో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ బాగా చూసేవారు. అది తనకు తెలికుండనే చాలా ప్రభావం చూపించింది. తన వయసుతో పాటే ప్రకృతిపై ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. పెద్దయ్యాక పర్యావరణం పై మాస్టర్స్ చేద్దామని అనుకున్నారు. కానీ తల్లి తండ్రుల కోరిక మేరకు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి అందులోనే ప్రొఫెసర్ గా చాలా ఏండ్లు పని చేశారు. అయినా ఆమె మనసు మాత్రం ప్రకృతి చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఆ క్రమంలోనే ‘ధృవాన్ష్’ అనే స్వచ్చంధ సంస్థని స్థాపించి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు.

నేటి తరానికి చెప్పాలి
హైదరాబాద్‌ చెరువులకు పెట్టింది పేరు. తన పర్యావరణ పరిరక్షణ ప్రయాణం ఇక్కడి నుండి మొదలు పెట్టారు. ‘ఇప్పటి తరం పిల్లలకు ఎంతసేపు వీడియో గేమ్స్, టీవీలు, మొబైల్ చూడటం తప్ప ప్రకృతితో వాళ్లకు అనుబంధం ఎక్కడ ఉంది? చెట్ల నుండి వీచే చల్లని గాలి అనుభూతి వారికి తెలుసా? పచ్చిక మీద, మట్టిలో చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుందో వారికి తెలియచెప్పే తల్లితండ్రులు ఈ రోజుల్లో కనిపించడం లేదు. ప్రకృతి ప్రాధాన్యం తెలియచెప్పడంలేదు. ప్రకృతి లేకపోతే మనుగడ లేదనే నిజాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఆమె మధులిక ఆవేదన చెందుతున్నారు.

చెరువుల పరిరక్ష‍ణకై…
నేటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆమె పర్యావరణ పరిరక్ష‍ణ కోసం తన వంతుగా కృషి చేయడం ప్రారంభించారు. ముందుగా మణికొండ ప్రాంతంలో మొక్కలు నాటే అవకాశం వచ్చింది. అయితే దానికి బదులు గ్రీనరీ ఆఫ్ లేక్స్ చేపట్టాలని నిశ్చయించుకుని ఇబ్రహీం చెరువులో భాగమైన నెక్నపూర్ సరస్సు చుట్టు మొక్కలు నాటి, ఆ సరస్సు నీటిని శుభ్రం చేయాడానికి పూనుకున్నారు. చుట్టూరా వంద మొక్కలు నాటాలనుకున్నవాళ్ళు ఏకంగా మూడు వేల మొక్కలు నాటారు. ఇబ్రహీం చెరువు విస్తీర్ణం 150 ఎకరాలు. ఇందులో నెక్నపూర్ 70 ఎకరాలు. చెత్తకుప్పలా ఉన్న దాన్ని అందమైన ఉద్యానవనంలా మార్చారు. అంతే కాకుండా మిగిలిన 80 ఎకరాల నెక్నపూర్ చెరువు గుర్రపు డెక్కలతో నిండి ఉండేది. దాన్ని శుభ్రం చేయడానికి ఆమెకు దాదాపు ఆరు నెలల పైగా పట్టింది. ఒకప్పుడు చెత్తతో నిండి ఉన్న ఈ చెరువు ఇప్పుడు పచ్చదనంతో నిండి రకరకాల పక్షులకు విడిదిగా మారింది. అంతేకాదు చెరువుల ఒడ్డున మంచి ఉద్యాన వనాలను పెంచి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి సాయంత్రం పూట వ్యాహ్యాళికి వచ్చే వారికి వినోదాన్ని అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -